విశాఖపట్టణం, డిసెంబర్ 23,
విశాఖ సెంట్రల్ జైల్ ఒక విచిత్రమైన పరిస్థితి ని ఎదుర్కొంటోంది. సామర్ధ్యాన్ని మించి ఖైదీలను భరిస్తోంది. జైల్ పూర్తి స్థాయి సామర్థ్యం 940 కాగా ప్రస్తుతం ఆ సంఖ్య 2100 దాటింది. నిజం. రెట్టింపు సామర్ధ్యాన్ని భరించలేక ఇబ్బంది పడుతోంది. దీంతో సరైన వసతులు లేక ఖైదీలు బాత్ రూమ్ ల వద్ద క్యూ లు కడుతున్నట్టు సమాచారం… ఇంత మంది ఖైదీలు ఉండడానికి కారణం గంజా కి సంబంధించిన ఖైదీలు ఎక్కువ ఉండడమే. ప్రస్తుతం ఉన్న 2100 మంది ఖైదీలలో 350 మంది మాత్రమే శిక్ష పడ్డ ఖైదీలు అయితే మిగతా 1750 మంది రిమాండ్ ఖైదీలు, వారిలో గంజా నేరస్తులు 1300 మంది. దీంతో అదనపు బారెక్స్ నిర్మాణం కాకుండా మేము చేర్చుకోలేం అంటూ విశాఖ కేంద్ర కారాగారం చేతులెత్తేసిన అంశం ఇప్పుడు ఆసక్తిగా మారింది.విశాఖ కేంద్ర కారాగారం సామర్ధ్యాన్ని మించిన ఖైదీలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటైన ఈ కరాగారంలో 11 బారెక్స్ ఉన్నాయ్. ఇందులో శిక్ష పడ్డ ఖైదీలకు, రిమాండ్ ఖైదీలకు, మహిళా ఖైదీలుగా మూడు విభాగాలు చేసి 940 మందిని ఉంచే వసతులు మాత్రమే ఉన్నాయి… ఆ సామర్ధ్యానికి తగిన వంట సామగ్రి, స్నానాలు, మరుగుదొడ్లు, ఇతర సౌకర్యాలు మాత్రమే ఉన్నాయి…కానీ ఇటీవల గడిచిన 4 నెలల కాలంలో ఖైదీల వరద సెంట్రల్ జైల్ ని తాకింది.ఒకవైపు ఆపరేషన్ పరివర్తన్ పేరుతో ఏజెన్సీ లో గంజా సాగును ధ్వంసం చేస్తోన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో గంజా ఉత్పత్తి చేస్తోన్న వారితో పాటు అమ్మతున్న వారు, రవాణా చేస్తోన్న వారు, వారికి సహకరిస్తోన్న వారిపై విపరీతంగా కేసులు నమోదు చేస్తున్నారు. దీంతో నిందితులను అరెస్ట్ చేసి జ్యూడిషియల్ రిమాండ్ కి పంపుతున్నారు. గంజా వ్యవహారంలో కేసు నమోదు చేసే ఎన్డీపీఎస్ చట్టాలు చాలా కటినంగా ఉంటాయ్. 20 కిలోల పైన గంజాయి ని కలిగి ఉంటే వారికి వెంటనే జ్యూడిషియల్ రిమాండ్ ఉంటుంది. ఆరు నెలల వరకు బెయిల్ దొరకడం గగనం. ఆ తర్వాత కూడా విచారణ సుదీర్ఘంగా ఉంటుంది. నేరం నిర్దారణ అయితే సంవత్సరం నుంచి 10 సంవత్సరాల జైలు శిక్ష, 1000 నుంచి లక్ష వరకు అపరాధ రుసుము చెల్లించాల్సి ఉంటుంది. అయితే పట్టుబడుతున్న వారిలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఉండడంతో వాళ్ళు ఎక్కువ కాలం బెయిల్ రాక, బెయిలు వచ్చినా సరైన ష్యురిటీ లు పెట్టలేక ఇక్కడే రిమాండ్ ఖైదీలుగా ఇక్కడే ఉండిపోతున్నారు. ఇలాంటి వాళ్ళతోనే ప్రస్తుతం విశాఖ సెంట్రల్ జైల్ నిండిపోయి ఉంది.ఒక్క ఎస్ ఈ బీ నే కాకుండా శాంతిభద్రతల విభాగపు పోలీస్ లు కూడా తమ తనిఖీల్లో దొరుకుతున్న గంజా నేరస్తులను పెద్ద సంఖ్యలో అరెస్ట్ లు చేసి జ్యుడీషియల్ రిమాండ్ కి పంపుతున్నారు. దీంతో జైల్ ఫుల్ అయి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. జైల్లో ఖైదీలకు వంట చేయాల్సింది కూడా కొందరు ఖైదీలే. పరివర్తన లో భాగంగా వంట వచ్చిన ఖైదీలు ఈ ప్రక్రియ లో పాలుపంచుకోవాలి. దీంతో వీళ్ళు తెల్లవారుజామున4 నుంచి పనులు ప్రారంభిస్తే తప్ప వంట కార్యక్రమాలు రాత్రి 8 వరకు కొనసాగుతున్నాయని తెలుస్తోంది. గతంలో ఒక్కసారి చేసే వంటలు సామర్ధ్యం రెట్టింపు కావడం, అవే వసతులు, అవే పాత్రలు కాబట్టి రెండు సార్లు చేయాల్సి వస్తోంది. అలాగే స్నానాల గదుల తో పాటు మరుగుదొడ్ల వద్ద కూడా పెద్ద ఎత్తున క్యూ లు కడుతున్నారని జైల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే అదనపు బ్యారెక్ ల నిర్మాణం చేపట్టాల్సి వస్తుందని, లేదంటే ఇకపై ఖైదీలను ఇక్కడ ఉంచుకోలేమని చెపుతున్నారు. దీంతో అధికారులు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించారు.