YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

తెరపైకి మన్సాస్ ట్రస్ట్

తెరపైకి మన్సాస్ ట్రస్ట్

విజయనగరం, డిసెంబర్ 23,
విజయనగరం మాన్సాస్ ట్రస్ట్ వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ ట్రస్ట్ ఛైర్మన్‌ నియామకంపై సంచయిత గజపతిరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. మాన్సాస్ ఛైర్మన్‌గా అశోక్‌గజపతిరాజు పునఃనియామకం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజును నియమిస్తూ హైకోర్టు సింగిల్‌ బెంచ్‌ గతంలో ఇచ్చిన తీర్పును సంచయిత డివిజన్‌ బెంచ్‌లో సవాల్ చేశారు. హైకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది.. రెండు వారాలకు వాయిదా వేసింది.
జగన్ సర్కార్ మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్థానం బోర్డు ఛైర్మన్‌ పదవుల నుంచి కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజును తొలగించిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో ఆనంద్ గజపతి కుమార్తె సంచయితను ప్రభుత్వం గతేడాది నియమించింది. గతేడాది మార్చిలో సింహాచల దేవస్థానం పాలక మండలి ఛైర్మన్‌గా ఆనంద గజపతిరాజు రెండో కుమార్తె సంచయిత గజపతిరాజును ప్రభుత్వం నియమించింది. ఆ మర్నాడే విజయనగరం రాజుల ఆధీనంలోని మాన్సాస్ ట్రస్టు బోర్డు ఛైర్మన్‌గా కూడా ఆమెను నియమించడంతో వివాదం మొదలయ్యింది. రొటేషన్ పద్ధతిలో సంచయితకు అవకాశం ఇచ్చినట్లు ప్రభుత్వం జీవోలో పేర్కొంది.ఛైర్మన్‌గా తొలగింపు సవాల్ చేస్తూ అశోక్ గజపతిరాజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వంశ‌పార‌ప‌ర్యంగా వ‌స్తున్న ట్ర‌స్టు కావడంతో వ‌య‌సులో పెద్ద‌వారు ట్ర‌స్టీగా ఉండాల‌ని.. ప్ర‌భుత్వం నిబంధ‌న‌ల‌కు వ్య‌తిరేకంగా ఈ ట్ర‌స్టుల ఛైర్మ‌న్‌ను నియ‌మించింద‌ని అశోక్ గజపతిరాజు న్యాయ‌స్థానం దృష్టికి తీసుకెళ్లారు. నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే నియామ‌కం చేశామ‌ని ప్ర‌భుత్వం వాద‌న‌లు వినిపించింది. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విని తీర్పును రిజ‌ర్వ్ చేసిన ధర్మాస‌నం.. ఈ ఏడాది జూన్‌లో ప్రభుత్వం జారీ చేసిన జీవోను హైకోర్టు కొట్టివేసింది. తిరిగి అశోక్ గజపతిరాజును ఈ రెండు ట్రస్ట్‌లకు ఛైర్మన్‌గా నియమించాలని ఆదేశించిన కోర్టు.. సంచయిత నియామకాన్ని రద్దుచేసింది.

Related Posts