YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

రఘవీరారెడ్డి దారెటు

రఘవీరారెడ్డి దారెటు

అనంతపురం, డిసెంబర్ 23,
రఘువీరారెడ్డి. రాజకీయాల గురించి కాస్త అవగాహన ఉన్న వారికి ఈ పేరు.. సుపరిచితమే. అనంతపురం జిల్లా మడకశిర ప్రాంతానికి చెందిన ఆయన.. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా.. రెండుసార్లు మంత్రిగా.. పీసీసీ అధ్యక్షుడిగా తనదైన ముద్ర వేశారు. ఒకానొక సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి స్థానంలో సీఎం రేసులో నిలబడ్డ నాయకుడు. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోవడంతో రాజకీయాలకు దూరంగా వెళ్లారు. 2019 ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ.. పీసీసీ పదవికి రాజీనామా చేసి.. స్వగ్రామం నీలకంఠాపురంకు వెళ్లిపోయారు రఘువీరారెడ్డి. పార్టీకి పార్టీ కార్యక్రమాలకు, సమావేశాలకు దూరంగా ఉండిపోయారు.సొంతూరులో నీలకంఠేశ్వరస్వామి ఆలయ పునర్మాణ పనుల్లో పడిపోయారు రఘువీరారెడ్డి. ఒకప్పుడు క్షణం తిరిక లేకుండా విమానాల్లో తిరిగిన ఆయన.. సాధారణ జీవితానికి పరిమితం అయ్యారు. రైతుగా మారి గడ్డి మోపులు మోశారు. పిల్లలతో ఆటలు, పెద్దలతో రచ్చబండపై ముచ్చట్లు.. టీవీఎస్ మోపెడ్‌పై చక్కర్లు.. ఇదే రఘువీరారెడ్డి జీవితం. ఆలయ పునర్‌నిర్మాణం పూర్తయింది. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఆలయాన్ని నిర్మించారు. ఆరు నెలల తర్వాత రాజకీయాల్లో యాక్టివ్‌ అవుతారని.. కొన్ని పార్టీలు ఆయనవైపు చూస్తున్నాయని.. ఇప్పటికే మంతనాలు జరిగాయని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఇందులో ప్రధానంగా టీడీపీ ఉంది. అధికార వైసీపీ నుంచి కూడా ఆహ్వానాలు ఉన్నాయని అంటున్నారు. దానిపై రఘువీరా ఎక్కడా నోరు విప్పలేదు. కనీసం సన్నిహితులతో సూచాయగా కూడా తన అభిప్రాయం చెప్పలేదు.రఘువీరా బహిరంగంగా మాట్లాడి దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఇటీవల జరిగిన మాజీ సీఎం రోశయ్య సంస్మరణ సభకు వచ్చి రఘువీరా మాట్లాడారు. రోశయ్యతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుత రాజకీయాలను ప్రస్తావించలేదు. అయితే రఘువీరా ఇప్పుడే రాజకీయాల్లోకి రారని.. నీలకంఠాపురంలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రి తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది. దీనికి సుమారు ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తరువాతే రాజకీయాలవైపు చూసే అవకాశం ఉందని సన్నిహితులు చెబుతున్నారు. కానీ రఘువీరాను లాగేందుకు టీడీపీ నుంచి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నట్టు సమాచారం.ఆయన చుట్టూ ఇంత జరుగుతున్నా.. రఘువీరా నోరు విప్పడం లేదు. మనసులో మాట చెప్పడం లేదు. రాజకీయాల్లో పునః ప్రవేశం చేస్తారా? లేక ఇప్పటిలాగే దూరంగా ఉంటారన్నది స్పష్టం కావట్లేదు. మరోవైపు రఘువీరా వారసురాలిగా ఆయన కుమార్తె వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగుతారనే ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే రఘువీరా రాజకీయాల్లోకి వస్తారా లేక కుమార్తెకు సహకరిస్తూ ఉంటారో చూడాలి.

Related Posts