తెలంగాణ టీడీపీ నేతలు మౌనంగా ఉండడంపై అనుమానాలు వ్యక్తం అవుతోంది.మౌనం వ్యూహాత్మకమనీ, వచ్చే ఎన్నికల్లో ఆలేరు నియోజవర్గం నుంచి పోటీచేసే ఆలోచనలో ఉన్నారనీ చర్చ జరుగుతోంది. ఒకవేళ ఆయన పోటీచేస్తే ఓటింగ్ సరళి ఎలా ఉంటుంది? పోటీ చేయకపోతే ఎలా ఉంటుంది? ఎవరి ఓటుబ్యాంకు ఎక్కువగా చీలిపోయే అవకాశం ఉంది? అనే అంశాలపై కొంతమంది నేతలు అంచనాలు వేసుకుంటున్నారట. తనని బరిలోకి దిగమని కార్యకర్తల నుంచి ఒత్తిడి ఉన్నమాట నిజమేనంటూ మోత్కుపల్లి తన సన్నిహితుల వద్ద చెప్పుకొచ్చారట కూడా. వచ్చే సాధారణ ఎన్నికల కోసం ఇప్పటినుంచే ఎవరికి వారు సిద్ధమవుతున్నారు. బరిలోకి దిగాలనుకునేవారు ఇప్పటికే ప్రణాళికలు రచించుకున్నారు. పాదయాత్రలు, వివిధ కార్యక్రమాల పేరిట ప్రజల్లోకి వెళుతున్నారు. ఎలాగైనా తమ ఇమేజ్‌ను పెంచుకోవాలని తాపత్రయపడుతున్నారు. తెలంగాణలో ఇదే పరిస్థితినెలకొంది. అధికార, విపక్ష నేతలు ఎవరి పంథాలో వారు ఎన్నికల వ్యూహాలను అమలుచేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆలేరు నియోజకవర్గం నుంచి టీ-టీడీపీ సీనియర్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు పోటీచేస్తారనే చర్చ జోరుగా సాగుతోంది. గతంలో ఆరుసార్లు శాసనసభ్యునిగా, మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి మళ్లీ ఇప్పుడు ఆలేరు నుంచి పోటీచేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జిల్లాల పునర్విభజన సమయంలో యాదాద్రి జిల్లా ఏర్పాటు కోసం ఉద్యమం చేపట్టి ప్రతిష్ట పెంచుకున్నారు మోత్కుపల్లి. నియోజకవర్గ అభివృద్ధి కోసం టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. కొంతకాలం క్రితం సొంత పార్టీ విషయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి తెరతీశాయి. ఈ మధ్య ఆయన మౌనంగా ఉంటున్నారు...జిల్లాలోని మరో నియోజకవర్గమైన భువనగిరిలో జిట్టా బాలకృష్ణారెడ్డిపై కూడా జోరుగా చర్చ సాగుతోంది. కొన్నాళ్ల క్రితం వరకు నియోజకవర్గ అభివృద్ధిపై సవాల్ విసురుతూ, స్థానిక ఎమ్మెల్యేపై విమర్శలు గుప్పించిన జిట్టా కొంతకాలంగా మౌనవ్రతం పాటిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక నేతగా ఉన్న ఆయన రెండుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా పోటీచేయడానికి సిద్ధమయ్యారు. అయితే ఒక్కసారిగా హడావుడి తగ్గించడం, ఎవరికీ అందుబాటులో ఉండకపోవడంపై నియోజవర్గంలో ఓ రేంజ్‌లో చెవులు కొరుక్కుంటున్నారు. ఆయన ఫలానా పార్టీలోకి వెళతారట కదా? అంటూ కొందరు గుసగుసలాడుతున్నరు. మొత్తంమీద ఈ ఇద్దరు నేతలు వచ్చే ఎన్నికల్లో బరిలో ఉండటం ఖాయంగా కనిపిస్తోందనే టాక్ జిల్లాలో వినిపిస్తోంది. అయితే ఉన్నట్టుండి ఈ నేతలు మౌనం దాల్చడం వెనుక ఉన్న మతలబు ఏంటో ఎవరికీ అంతుబట్టడం లేదు. చూద్దాం వీరి మౌనానికి భవిష్యత్తు ఏ భాష్యం చెబుతుందో!