రాజస్తాన్ రాజ్ సమంత్ జిల్లాలో కుంభాల్ఘఢ్ తాలుకా ఘర్బోర్ గ్రామంలో చార్భుజ మందిర్ లో నెలవైయున్న శ్రీకృష్ణుడు నాలుగు భుజాలు కలిగి వున్నందున ఈ దేవాలయం చార్భుజా మందిర్ గా ప్రసిధ్ధికెక్కింది. గంగదేవ్ అనే రాజపుత్ర మహారాజు యీ ఆలయం నిర్మించాడు. గర్వాడ్ వంశం చెందిన మహీపాల మహారాజు, ఆయన కుమారుడు రావత్ లక్ష్మణ్ ఈ ఆలయాన్ని పునరుధ్ధరించారని , పూర్వకాలంలో
యీ ప్రాంతానికి " బద్రీ" అనే పేరు వుండేదని శాసనాలు తెలుపుతున్నాయి.
ఈ ఆలయం చరిత్ర ....
శ్రీ కృష్ణుడు తన అవతార పరిసమాప్తి సమయంలో తన పినతండ్రి కొడుకైన ఉధ్ధవుని పిల్చి హిమాలయాలకు వెళ్ళి తపమాచరించమని, తను వైకుంఠానికి వెళ్ళదలచినట్లు తెలిపాడు . అందుకు ఉధ్ధవుడు ," నేను తపస్సు చేస్తే నాకు మోక్షం వస్తుంది ,కాని నిన్నే ప్రాణంగా భావించే పాండవులు , బాల్య మిత్రుడు సుదాముడు ప్రాణాలనే వదిలేస్తారు. వారికి అండ ఎవ్వరు?" అని అన్నాడు.
శ్రీకృష్ణుడు దేవశిల్పి అయిన విశ్వకర్మని పిలిపించి రెండు విగ్రహాలను తయారు చేయించాడు. ఆ విగ్రహాలలో ఒకటి బలరామునిది, మరియొకటి శ్రీ కృష్ణునిది. ఆ రెండు విగ్రహాలను ఇంద్రునికి యిచ్చి , వాటిలో ఒకటి ధర్మరాజు కి, మరియొకటి సుదామునికి అందజేసి ఆ విగ్రహాలలో తన అంశ ఉన్నదని వారికి తెలుపమని" ఆదేశించాడు. రానున్న కలియుగంలో ఆ విగ్రహాలను ఎవరైతే పూజిస్తారో వారి మనోవాంఛితాలు తప్పక నెరవేరుతాయని చెప్పాడు కృష్ణుడు.
ఘర్భోర్ చార్భుజా ఆలయంలో వున్న విగ్రహం పాండవులు పూజించినది. సుదాముడు పూజించిన విగ్రహం స్రవంతి అనే చోట "రూప్ నారాయణ్" అనే పేరుతో పూజించ బడుతున్నది.
పాండవులు తమ అంతిమకాలంలో , హిమాలయాలకు వెళ్ళిపోతూ యీ విగ్రహాన్న నదిలో వదిలి వేశారు. చాలాకాలం తరువాత ఘర్భోర్ మహారాజు గంగదేవుని స్వప్నంలో దర్శనమిచ్చిన కృష్ణుడు నదీగర్భంలో వున్న తన విగ్రహాన్ని తీసి ఆలయం నిర్మించమని ఆదేశించాడు. ఆవిధంగా నిర్మించబడిన ఆలయమే యిది. మొగలాయ్ చక్రవర్తులు యీ ఆలయాన్ని అనేక సార్లు ధ్వంసం చేశారు. ఆ సమయాల్లో దేవుని విగ్రహాన్ని తీసి రహస్యంగా నీటి అడుగున దాచేవారు. మేవాడ్ మహారాణా యీ ఆలయాన్ని తిరిగి పునరుధ్ధరించారు. నిత్యం ఆలయాన్ని దర్శించడం ఆనుష్టానంగా పాటించే మహారాజు ఒకనాడు ఆలయానికి ఆలస్యంగా వచ్చాడు. అప్పటికే పూజలు ముగించిన అర్చకుడు భగవంతునికి ఏకాంత సేవ కూడా ముగించి స్వామిని శయనభంగిమలో పెట్టేడు. మహారాజుకి వేయవలసిన స్వామివారి దండని తనే ధరించాడు. ఇది జరిగిన కొంతసేపటికి మహారాజు స్వామి సన్నిధికి వస్తూండడం గమనించిన ఆ అర్చకుడు తన మెడలోని దండను ఎవరూ చూడకుండా తీసివేసి మరల ఆ దండనే మహరాజు కు అందజేశాడు. ఆ దండలో ఒక తెల్లటి శిరోజం వుండడం గమనించిన మహారాజు అర్చకునిలో నిర్లక్ష్యం పెరిగిందనే తలంపుతో భగవంతునికి వృధ్ధాప్యం వచ్చిందాయని వ్యంగ్యంగా అడిగి ఈ విషయమై నిజానిజాలు తేల్చేందుకు ఆజ్ఞ యిచ్చాడు. మరునాడు ఉదయం భగవంతుని శిరస్సున నెఱసిన శిరోజాలు కనిపించాయి. ఎవరో ఆ శిరోజాలను ఆంటించి వుంటారని ఆ శిరోజాలను బలంగా లాగగా స్వామివారి శిరసుపై రక్తం వచ్చింది. అది చూసిన మహారాజు అర్చకుని భక్తికి ఆశ్చర్యపడి అతని పాదాల మీదపడి క్షమించమని వేడుకున్నాడు. ఈవిధంగా కరుణా సముద్రుడైన భగవంతుడు తన లీలల ద్వారా ఒక అమాయక అర్చకుని కాపాడాడు ఆనాడు రాత్రి మహారాజు స్వప్నంలో దర్శనమిచ్చిన కృష్ణుడు " అహంకారపూరితులై, మహరాజు హోదాలో వుండే వ్యక్తి తన దర్శనానికి అనర్హులని , అలాటివారు తన సన్నిధిలో అనుమతించనని , కానీ, వారి భార్యాపుత్రులు యదావిధిగా తనను సేవించుకోవచ్చని శాసించాడు. ఒక యువరాజు మహారాజ పదవికి రాగానే ఈ ఆలయానికి వెళ్ళి దేవుని పూజించే అర్హత కోల్పోతాడు. ఇది ఈ ఆలయంలో పారంపర్యంగా వస్తున్న ఆచారం.
ఈ ఆలయానికి వైకుంఠ ఏకాదశినాడు లక్షలాది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారు.
రాజస్థాన్ లోని ఉదయపూర్ నుండి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఈ ఘర్భోర్ ఛార్భుజ కృష్ణమందిరం వున్నది.