*దానధర్మాలు లేక దయయు సత్యము లేక*
*మానసమున మంచి నీతిలేక*
*చెడుగుణంబుల తోడ* *చెరలాడుచున్నట్టి*
*నరుడు ఇలను చెడును; పరము చెడును....*
*ఈ జన్మలో మనం అనుభవిస్తున్న కలిమిలేములు, క్రిందటి జన్మలో మనం చేసిన దానధర్మాల ఫలమే అన్నది దైవ శాసనం. "అన్నదానము కన్న అధిక దానము లేదు" అన్న సూక్తి ఒక హరిదాసు చెప్పగా విని ఒక పిండిమర వర్తకుడు అన్నదానం చేసి తరించాలి అనుకున్నాడు. అయితే అతను పరమ లోభి. చాలాకాలంగా చెడిపోయి మూలపడి ఉన్న గోధుమపిండి అతని స్టోర్ లో ఉంది. దాన్ని చీమలు పురుగులు కూడా తినలేవు. ఆ పిండితో రొట్టెలు చేయించి నిత్యం అయిదారుగురు పేదలకు పెట్టడం ప్రారంభించాడు. అది మహాపాపమని, ఆ పెట్టేది మంచి పిండితో చేసి ఒక్కరికి పెట్టినా పుణ్యం అని అతని భార్య పరిపరివిధాల చెప్పింది. కానీ అతడు వినలేదు......*
*ఒకనాడు అతని భార్య ఆ పిండితోనే రొట్టెలను చక్కగా చేయించి అతనికే పెట్టింది. అతను తినలేక భార్యను గట్టిగా మందలించాడు. అప్పుడు అతని భార్య "ఇది మీ మంచి కోసమే చేశాను. ఎప్పుడో ఒకప్పుడు మీరు చేస్తున్న దానం ఫలితంగా మీరు ఇలాంటి రొట్టెలను తినవలసి వస్తుంది. ఇప్పుడు మీరు వీటిని తినడం అలవాటు చేసుకుంటే, అప్పుడు అంత బాధ ఉండదు" అన్నది. ఆ మాటలతో భర్త బుర్ర గిర్రున తిరిగింది. అప్పట్నుంచి మంచి పిండితో చేసిన రొట్టెలు దానం చేయాలని నిర్ణయించుకున్నాడు.....*
*ఆధ్యాత్మిక రంగంలో సులభ మార్గంలో ఫలితాన్ని అనుభవించాలని అనుకోవడం స్వార్థం. స్వప్రయోజనం, కుయుక్తులతో పుణ్యాన్ని సంపాదించాలని అనుకోవడం ఆత్మవంచన అవుతుంది.*