ఆనందాలకు నిలయమే స్వర్గమని అందరూ భావిస్తారు. ఇహలోకంలోని బాధలు, దుఃఖాలు స్వర్గానికి అతీతమనే నమ్మకం చాలామందికి ఉంటుంది. బాగా డబ్బున్నవారంతా ఇళ్లు, సౌకర్యాలతో స్వర్గసుఖాలు అనుభవిస్తున్నారనే అపోహతో కొందరు అసూయపడుతుంటారు. అది నిజం కాదు. సుఖదుఃఖాలకు నిలయం మనసే. మనసు బాగుంటే అన్నీ బాగున్నట్లే. శక్తికి మించిన ఆలోచనలు, ఆకాంక్షలు మనసును అశాంతికి గురిచేస్తాయి. మనం ఆనందం వెతుక్కోవలసింది- వస్తువుల్లో సౌకర్యాల్లో కాదు... మనసులో! ఆధ్యాత్మికత అంటే మనసు మీద అధికారం. దానికోసం సాధకులు ఎన్నో కష్టాలు పడుతుంటారు. జప, ధ్యాన, తపస్సులన్నీ ముందు మనసును అదుపులోకి తెచ్చుకుని, ఆ తరవాత కావాల్సినవి పొందడానికి.
కృషికి తగిన ఫలితాలు ఎప్పుడూ లభిస్తాయి.
స్వల్ప కృషితో అధిక ఫలాలు పొందడం అసాధ్యం.
చాలామంది ఇలాంటి ప్రయత్నాలతోనే వైఫల్యాలు చవిచూస్తుంటారు.
తమ లోపాలను అర్థం చేసుకోరు.
లోపాలతో ఎవరూ ఏమీ సాధించలేరు.
కేవలం మనం ఒక్కరమే ఆనందంగా ఉండాలనేది స్వార్థం.
లోకంలో చాలామందిని ఈ స్వార్థం వేధిస్తోంది. మానవ సంబంధాలు సవ్యంగా లేకపోవడానికి ఇది చాలావరకు కారణం.
స్వార్థంలోనూ స్థాయీభేదాలు ఉన్నాయి.
స్వార్థం లేశమైనా లేనివారు మహాత్ములే.
ఎక్కడోకానీ వారు కనిపించరు.
జనం వారిని ఎంతో గొప్పగా చూస్తారు.
సేవలు చేస్తారు.
తామూ అలా మారాలని మాత్రం ప్రయత్నించరు. జన్మతోనే అతి కొద్దిమంది స్వార్థం లేకుండా ఉంటారు.
వారు ఇతరుల ఆనందంలో తమ ఆనందం చూస్తారు.
కోరికలకు సంతోషానికి సంబంధం ఉంది.
కోరికలు తీరితే సంతోషం. అది శాశ్వతం కాదు. ఒక కోరిక తీరగానే మరో కోరిక సిద్ధంగా ఉంటుంది.
ఇలా మనిషి జీవితమంతా కోరికలతో నిండి ఉంటుంది.
మరణ సమయంలోనూ కోరికలతోనే మనిషి సతమతమవుతాడు.
సంతోషానికి కోరికలతో అనుబంధం ఉన్నంత కాలం మనిషికి అసలైన ఆనందం అనుభవంలోకి రాదు.
ఆధ్యాత్మికత అసలు ఉద్దేశం- మనిషిని కోరికలకు అతీతుడిగా మార్చడం.
అందుకు అనేక విధానాలు పాటిస్తారు.
కాని, వాటిని ఆసాంతం అనుసరించరు.
అనేక సందేహాలు, అసహాయతలు అడ్డుపడుతుంటాయి. కొందరు తమ ప్రయత్నాలకు స్వస్తి పలుకుతారు కూడా.
జీవన్ముక్తి కోసం మనిషి ఏ ఉద్యోగంలోనూ పడనంత కష్టం ఎదుర్కోవాలి.
తక్షణ ఫలితాలంటూ ఏమీ ఉండవు.
ఇహలోక సంబంధాలకు అతీతంగా మనసును మార్చుకోవాలి.
ఇది చెప్పినంత తేలిక కాదు.
సమయానికి భోజనం లేకపోతేనే మనిషి అల్లాడిపోతాడు.
భోజనం లేదా ఆకలిని తీర్చే మరేదైనా తినేదాకా స్థిమితం ఉండదు.
ఇవన్నీ మనందరి అనుభవాలు.
ఒకేసారి అన్ని కోర్కెలూ వదులుకోలేము.
ఒక్కోటీ ప్రయత్నించాలి.
అందుకే కాశీలో కోర్కెల త్యాగం చెయ్యాలంటారు. త్యాగం అలవాటు కావాలి.
జీవితంలో ఆఖరి మజిలీకి చేరుకున్నాక మనం చేసిన తప్పులన్నీ గుర్తొస్తాయి.
అయితే, మనం కేవలం పశ్చాత్తాపం చెందగలం. అంతే.
కోరికలు మనల్ని స్వర్గానికి దూరంగా కూర్చోబెడతాయి.
కాబట్టి, కోరికలను త్యాగం చేస్తే మనం స్వర్గానుభూతిని అప్పుడే అక్కడే పొందగలం.