YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఎర్రబంగారానికి మంచి ధర

ఎర్రబంగారానికి మంచి ధర

గుంటూరు, డిసెంబర్ 24,
రైతు లైఫ్ ఎప్పుడూ లాటరీనే.. పంటకు ఎప్పుడు ధర పెరిగిద్దో.. ఎప్పుడు ఢమాల్ అంటుందో ఎవ్వరూ చెప్పలేరు.. అందుకే కొందరు రైతులు అంటుంటారు.. వ్యవసాయం ఒక జూదమని. రాయలసీమ వరదల సమయంలో ఆకాశన్నంటిన టమాటా ధర.. ఆ తర్వాత వారం రోజులకే కిందకి పడిపోయింది. తాజాగా ఎర్ర బంగారంగా పిలిచే మిర్చి కూడా అధిక ధరలు పలుకుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.ఈ ఏడాది మార్చి నుంచి నవంబర్ వరకు క్వింటా రూ.13, 14 వేల మధ్య కొనసాగిన మిర్చి ధర.. డిసెంబర్‌లో ఒక్కసారిగా రూ.6 వేలు ఎగబాకి క్వింటా రూ.20 వేలకు చేరింది. ప్రస్తుతం మిర్చి పంటకు తామర పురుగు సోకడంతో.. పంటకు తెగులు పట్టింది.. ఈ నేపథ్యంలోనే మిర్చి ధరలు ఒక్కసారిగా పెరిగాయంటూ వ్యాపారస్థులు చెబుతున్నారు. గతేడాది ఎకరాకి 25 నుంచి 35 క్వింటాళ్ల దిగుబడి రావడం.. కల్లాల్లోనే క్వింటా రూ.13 వేలు పలకడంతో ఈ ఏడాది కూడా ఎక్కువ ఎకరాల్లో మిర్చి పంటను సాగు చేశారు.ముఖ్యంగా కృష్ణా జిల్లాలో సుమారు 70 వేల ఎకరాల్లో రైతులు మిర్చి సాగు చేశారు. తామర పురుగు ఉధృతి ఉన్న నేపథ్యంలో.. మార్కెట్‌కు పంట తక్కువగా వస్తుందన్న నేపథ్యంలో మిర్చి ధరలు క్వింటా రూ.20 వేలకు చేరుకున్నాయని.. ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని రైతు వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. దాదాపు లక్ష టిక్కీల వరకు యార్డుకు మిర్చి వచ్చింది. కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న సరుకు ఎక్కువగా యార్డుకు వస్తోంది. వివిధ వెరైటీల గరిష్ట ధర సగటున క్వింటాలుకు రూ.18 వేలు పలకగా కనిష్ట ధర రూ.9 వేల వరకు పలికింది. గతనెల కంటే ఈ నెలలో ధరల పెరుగుదల ఎక్కువగా ఉంది. గతనెలలో నాన్‌ఎసి కామన్‌ వెరైటీ సగటు ధర కనిష్టంగా రూ.7 వేలు ఉండగా గరిష్టంగా రూ.12 వేల వరకు పలికింది. తాజాగా ఇదే వెరైటీలు కనిష్ట ధర రూ.7 వేలు, గరిష్ట ధర రూ.16 వేలుగా ఉంది. 20 రోజుల క్రితం నాన్‌ ఎసి స్పెషల్‌ వెరైటీల్లో క్వింటాలుకు కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.14 వేలు వచ్చింది. ప్రస్తుతం కనిష్ట ధర రూ.9 వేలు, గరిష్ట ధర రూ.18 వేల వరకు వచ్చింది. ఇదే రీతిలో ఎసి కామన్‌ వెరైటటీలు గత నెలలో కనిష్ట ధర రూ.7 వేలు, గరిష్ట ధర రూ.13 వేలు పలికింది. ప్రస్తుతం ఇవే వెరైటీలు కనిష్ట ధర రూ.9300, గరిష్ట ధర రూ.17500 పలికాయి. ఎసి స్పెషల్‌ వెరైటీల్లో గతనెలలో కనిష్ట ధర రూ.9 వేలు గరిష్ట ధర రూ.14 వేలు రాగా ఈనెలలో ప్రస్తుతం కనిష్ట ధర రూ.7200, గరిష్ట ధర రూ.18 వేలు పలికింది. ప్రతి వెరైటీకి క్వింటాలుకు గరిష్టంగా రూ.2 వేల నుంచి రూ.4 వేల వరకు పెరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. మార్కెట్‌లో బాగా డిమాండ్‌ ఉండే తేజ, బాడిగ వెరైటీలు రూ.18 వేలు దాటి కూడా పలికాయి. కొంత సరుకు గరిష్టంగా క్వింటాలు రూ.20 వేల వరకు పలికినట్టు వ్యాపార వర్గాలు తెలిపాయి. ఏటా డిసెంబరు 20 కల్లా కొత్త సరుకు మార్కెట్‌కు రావడం అనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది సాగు ఆలస్యమవడం, తామర తెగులు వల్ల పైరు దాదాపు లక్ష ఎకరాల్లో దెబ్బతినడం వల్ల పంట రావడంలో కొంత జాప్యమవుతోంది. ఈ లోగా కోల్డ్‌ స్టోరేజీల్లో ఉన్న సరుకును యార్డుకు తీసుకువస్తున్నారు. కోల్డ్‌ స్టోరేజీల్లో ఇంకా పది లక్షల టిక్కీల వరకు ఉంటుందని, ఈ సరుకు ఈనెలాఖరు కల్లా విక్రయాలు పూర్తవుతాయని జనవరి మొదటి వారం నుంచి కొత్త సరుకు రావడం ప్రారంభం అవుతుందని అధికారులు చెబుతున్నారు. గుంటూరు జిల్లాలో మిర్చి సాధారణ విస్తీర్ణం 1.70 లక్షల ఎకరాలు కాగా ఈ ఏడాది 2.65 లక్షల ఎకరాల్లో మిర్చిసాగు చేశారు. అయితే ఇప్పటికే లక్ష ఎకరాల్లో తామర తెగులు వల్ల పైరు దెబ్బతినడం, మరో లక్ష ఎకరాల్లో పంట ఎంత వరకు నిలదొక్కుకుంటుందనేది ప్రశ్నార్ధకంగా మారడంతో దిగుబడులు తగ్గే అవకాశం ఉంది. దీంతో ముందస్తుగానే ఈ ఏడాది వ్యాపారులు ధరలు పెంచి కొనుగోలు చేస్తున్నారు. వచ్చే సీజన్‌లో మిర్చి సరుకు కొరత కూడా ఏర్పడవచ్చని భావించి ముందుగానే కొనుగోలుకు ప్రయత్నిస్తున్నారు.

Related Posts