కడప, డిసెంబర్ 24,
కడప జిల్లాలోని రిమ్స్ మెడికల్ కళాశాలలో సూపర్ స్పెషాలిటీ సేవలకు మోక్షమెప్పుడో తెలియడం లేదు. రాయలసీమ సరిహద్దు జిల్లాలైన కర్నూలు, అనంతపురం, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరుకు చెందిన రోగులు పెద్ద ఎత్తున రిమ్స్‌లో వైద్యసేవలు పొందుతున్న విషయం తెలిసిందే. రాయలసీమకు నడిబొడ్డున ఉన్న కడప జిల్లాలో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించాల్సిన అవసరం ఉందనే డిమాండ్ పెద్దఎత్తున వినిపిస్తోంది. ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన జగన్‌మోహన్‌రెడ్డి 2019 డిసెంబర్ 23న రిమ్స్‌లో సూపర్ స్పెషాలిటీ సేవలు అందించడానికి రూ.272.81 కోట్ల వ్యయంతో వైఎస్‌ఆర్ కేన్సర్ కేర్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ హెల్త్ కేర్ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అప్పటి నుంచి నేటి వరకు మూడు బ్లాక్‌ల నిర్మాణ పనులకు సంబంధించి డిపిఆర్ సర్వే, జ్యుడీషియల్ ప్రివ్యూ, టెండర్ల దశలను దాటలేదు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీకి, చేసిన శంకుస్థాపనలకు ఏడాదిగా ఎటువంటి పురోగతి లేదు. మూడు బ్లాక్‌ల భవన నిర్మాణాలు పూర్తి చేసుకుని, సుమారు 200 మంది స్టాఫ్ రిక్రూట్‌మెంట్ దశలను దాటుకుని పూర్తి స్థాయిలో సూపర్ స్పెషాలిటీ సేవలు ఎప్పుడు మొదలవుతాయో? తెలియడం లేదు. నత్తనడకన సాగుతున్న సూపర్ స్పెషాలిటీ సేవల పురోగతిని పరిశీలిస్తే... 2019 డిసెంబర్ 19న వంద పడకల సామర్థ్యం కలిగిన రూ.107 కోట్ల వ్యయంతో డాక్టర్ వైఎస్‌ఆర్ క్యాన్సర్ కేర్ సెంటర్ మంజూరైంది. దీనికి ఈ ఏడాది అక్టోబర్ నెలల్లో టెండర్లు పిలిచారు. నవంబర్ 18న జ్యుడీషియల్ ప్రివ్యూ, టెండర్ల కమిటీ పరిశీలనకు పరిమితమైంది. ఇదే తరహాలో 2019 డిసెంబర్ 21న 90 పడకల సామర్థ్యంతో రూ.40.81 కోట్ల వ్యయంతో ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ కేర్ హాస్పిటల్ మంజూరైంది. 2019 డిసెంబర్ 22న 504 పడకలు కలిగిన రూ.125 కోట్ల వ్యయంతో కూడిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులకు అనుమతులు మంజూరు చేసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏడాది గడువు పూర్తవుతున్నప్పటికీ డిపిఆర్, టెండర్లు, జ్యుడీషియల్ ప్రివ్యూ, టెక్నికల్ కమిటీ వంటి దశలను అధిగమించడంలో మీనమేషాలు లెక్కిస్తోంది. దీనికి కారణాలేమిటని పరిశీలిస్తే ఈ ఏడాది మార్చి నుంచి రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభించడం, డ్రాయింగ్ పనులు అప్రూవల్, డిపిఆర్, డిజైన్ల ఎస్టిమేట్లు, జ్యుడీషియల్ ప్రివ్యూ, టెక్నికల్ కమిటీ వంటి దశలను దాటడంలో చోటుచేసుకున్న నిర్లక్ష్యమే కారణమని తెలుస్తోంది. ఈలెక్కన మరో రెండేళ్లు గడిచినా సూపర్‌స్పె షాలిటీ సేవలు, ఇతర ఆధునిక సేవలు అందు బాటులోకి వచ్చే అవకాశం లేనట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సత్వరమే స్పందించి సూపర్ స్పెషాలిటీ సేవలను అందించడంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.