విజయవాడ, డిసెంబర్ 24,
ఉపాధి హామీ పథకం నిధులు మంజూరవ్వక గ్రామాల్లో పంచాయతీ, సచివాలయ, రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) భవన నిర్మాణాలు స్తంభించాయి. లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టి భవనాలను నిర్మిస్తున్నా, అరకొర బిల్లులే మంజూరవుతున్నాయి. ఇప్పటికే అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపడుతున్నా నెలల తరబడి బిల్లులు పెండింగ్ ఉండటంతో ఇక తాము పనులు చేయలేమంటూ కొందరు ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. ఉపాధి హామీ పథకంలో జరిగిన పని విలువ ఆధారంగా కేంద్ర ప్రభుత్వం 40 శాతం మెటీరియల్ గ్రాంట్‌ను విడుదల చేయాల్సి ఉండగా, తాత్సారం చేస్తోంది. 2021-22 ఆర్థిక సంవత్సరానికి కేంద్రం రూ.6,625 కోట్లను రాష్ట్రానికి కేటాయించింది. కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో ఎనిమిది నెలల్లోనే రూ.7,376.41 కోట్ల విలువైన ఉపాధి పనులు జరగడంతో, సుమారు రూ.3 వేల కోట్ల మెటీరియల్ కాంపోనెంట్ రావాల్సి ఉంది. ఇప్పటి వరకు కేంద్రం ఆగస్టు, సెప్టెంబరులో రెండు విడతలుగా రూ.1,703.88 కోట్లను మాత్రమే విడుదల చేయగా, మరో రూ.1,800 కోట్లు రావాల్సి ఉంది. ఎపికి మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ.1,300 కోట్లే పెండింగ్‌లో ఉన్నట్లు ఇటీవల పార్లమెంట్‌లో కేంద్ర మంత్రి ప్రకటించడం గమనార్హం.
ఉపాధి మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో భవన నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3,500 కోట్లపైనే ఖర్చు చేసింది. అందులో రూ.1,872 కోట్లతో 10,365 గ్రామ పంచాయతీ, సచివాలయ భవన నిర్మాణాలను, రూ.781 కోట్లతో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బికె) నిర్మాణాలను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. ఇప్పటి వరకు సుమారు రూ.3,500 కోట్లను ఖర్చు చేసినట్లు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ నుంచి మెటీరియల్ కాంపోనెంట్‌ను విడుదల చేయకపోవడంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పంచాయతీ, సచివాలయ, ఆర్‌బికె భవన నిర్మాణాలు స్తంభించాయి. రాష్ట్రంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ప్రస్తుతం ఉన్న పంచాయతీ కార్యాలయ భవనాలు సిబ్బందికి చాలకపోవడంతో ప్రత్యేకంగా సచివాలయాలను నిర్మిస్తున్నారు. ఆ భవనాలు అసంపూర్తిగా ఉండటంతో ఇరుకు గదులలోనే సిబ్బంది విధులను నిర్వర్తించాల్సి వస్తోంది. చేసిన పనులకు కూడా బిల్లులు మంజూరు కాకపోతే ఎక్కడ నుంచి డబ్బులు తేవాలని భవన నిర్మాణాల పనులు చేపట్టిన ప్రజా ప్రతినిధులు వాపోతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేల భరోసాతో రెండేళ్లగా గ్రామ సచివాలయాలు, ఆర్‌బికె భవనాలను నిర్మిస్తున్నా, బిల్లులు ఎపుడు మంజూరవుతాయో కూడా తెలియని పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. అసంపూర్తి భవన నిర్మాణాలను పూర్తి చేయాలంటే తక్షణమే మెటీరియల్ కాంపోనెంట్‌ను విడుదల చేయాలని ఇటీవల పంచాయతీరాజ్ అధికారులు కేంద్రాన్ని కోరినా ఎలాంటి ఫలితం లేదు.