ర్నూలు, డిసెంబర్ 254,
వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించేందుకు కర్నూలు జిల్లాలో జోరుగా సన్నాహాలు సాగుతున్నాయి. ఇందుకు సంబంధించి నుంచి రైతుల నుంచి సమ్మతి పత్రాలు తీసుకుంటున్నారు. ఆయా రైతులతో నాన్ ఆపరేటివ్ బ్యాంకు ఖాతాను తెరిపించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రక్రియ మొత్తం చేపట్టే బాధ్యతను ప్రభుత్వం ఓ ప్రయివేటు ఏజెన్సీకి అప్పగించింది. నాన్ ఆపరేటివ్ బ్యాంకు ఖాతాను నిర్వహించేందుకు రైతులకు వీలు కాదు. డబ్బులు జమ చేయడం, తీసుకోవడం అన్నీ ప్రభుత్వం, బ్యాంకు చేతుల్లోనే ఉంటాయి. రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాల్లో దీన్ని పైలట్ ప్రోగ్రాముగా ప్రభుత్వం చేపట్టి ఇప్పటికే పూర్తి చేసింది. కర్నూలు జిల్లాలో కూడా దీన్ని అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఈ ప్రక్రియ జూన్ నాటికి పూర్తి చేసి జులై నుంచి మీటర్ల బిగింపు చేపట్టాలని అధికారులు యోచిస్తున్నారు. మీటర్ల బిగింపు ప్రక్రియను రాష్ట్రమంతా ప్రారంభించేందుకు ఏర్పాట్లు సాగుతున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లాలో రెండు లక్షల వ్యవసాయ కనెక్షన్లు ఉన్నాయి. వీటికి సంబంధించి విద్యుత్ పంపిణీ సంస్థ, రైతుల మధ్య ఒప్పంద ప్రక్రియ కోసం ప్రయివేట్ ఏజెన్సీ ప్రతినిధులు, అధికారులు గ్రామాల్లో పర్యటిస్తున్నారు. రైతుల నుంచి సంతకాలు తీసుకుంటున్నారు. 'ఉచిత విద్యుత్తు వినియోగానికి మంజూరు చేసిన రాయితీ నగదును ప్రత్యేక బ్యాంకు ఖాతాకు విడతల వారీగా బదిలీ అయిన వెంటనే ఆ మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థ బ్యాంకు ఖాతాకు బదిలీ చేసేందుకు నా సమ్మతి తెలియజేస్తున్నాను' అని రైతులతో సంతకాలు చేయించుకుంటున్నారు.స్మార్ట్ మీటర్ల బిగింపు కోసం ఇప్పటికే టెండర్లు పిలిచారు. ఏ సంస్థా ముందుకు రాకపోవడంతో మళ్లీ టెండర్లు పిలిచే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. 5 హెచ్‌పి మోటారుకు గంటకు 3.75 కిలోవాట్ల విద్యుత్తు ఖర్చవుతుంది. రోజుకు తొమ్మిది గంటలు మోటరు వాడితే రోజుకు 33.75 యూనిట్లు, నెలకు 1012 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఒకవేళ లోవోల్జేజీ సమస్య తలెత్తినప్పుడు, పంపుసెట్టుకు అదనంగా పైపులు వేసి దూర ప్రాంతానికి తరలించినప్పుడు తప్పనిసరిగా అదనపు విద్యుత్తు ఖర్చు కానుంది. పంపుసెట్లు కాలిపోయినప్పుడు మళ్లీ రీవైండింగ్ చేసి వాడుకొంటున్న వాటికి కూడా అదనపు విద్యుత్ ఖర్చయ్యే అవకాశం ఉంది. రైతులు తమకు కేటాయించిన విద్యుత్ కంటే ఎక్కువ విద్యుత్‌ను వాడితే అభివృద్ధి నిధులను చెల్లించాలని షరతు విధించినట్లు తెలుస్తోంది. రైతులకు సరైన అవగాహన కల్పించకుండా వారిపై ఒత్తిడి తెచ్చి అంగీకార పత్రాల మీద సంతకాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం చేపట్టనున్న స్మార్ట్ మీటర్ల విధానం ఉచిత విద్యుత్‌కు స్వస్తి పలికేలా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ప్రక్రియ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నారు. జిల్లాలో రైతుల నుంచి సంతకాలు తీసుకుంటున్న మాట వాస్తవమే. రైతుల పేరుతో ఖాతాలను తెరవనున్నారు. ఆ ఖాతాల్లో ప్రభుత్వం విద్యుత్ రాయితీని జమ చేయనుంది. మరో ఆరు నెలల తరువాత మీటర్ల బిగింపు ప్రక్రియ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. మీటర్ల బిగింపు వల్ల ఎంత విద్యుత్ వాడుతున్నారో తెలుస్తుంది. మీటర్ల కోసం రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదంటున్నారు. కె.శివప్రసాద్ రెడ్డి, విద్యుత్ శాఖ ఎస్‌ఇ