YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు

ప్రాణాలు తీస్తున్న కల్తీ కల్లు

నిజామాబాద్, డిసెంబర్ 24,
ప్రజల ప్రాణాలు పోతే పోనీ. అనారోగ్యం పాలైతే గాని. ఎవరేమైతే మాకేంటి. అమ్మకాలు చేశామా.. డబ్బులు సంపాదించామా, మమ్మల్ని అడిగే వారేవరు అన్నట్టు కల్లు అమ్మకందారుల తీరు విమర్శలకు తావిస్తోంది. బాన్సువాడ, బోధన్ డివిజన్‌లో  వరుసగా జరుగుతున్న కల్తీ కల్లు కేసులు ఎక్సైజ్ అధికారుల నిద్ర మత్తు‌ను తేటతెల్లం చేస్తున్నాయి.ఈత, తాటి చెట్ల నుంచి కల్లు సేకరించాలి కానీ, ప్రమాదకరమైన రసాయనాలతో తయారు చేస్తున్నారు. అందుకు నిషేధిత జాబితాలో ఉన్న డైజోఫాం, క్లోరోఫాం, ఆల్ఫోజ్ లాంటి మత్తు పదార్థాలను నల్ల బజారులో కొనుగోలు చేసి, కల్లు డిపోలకు తెచ్చుకుంటున్నారు. అక్కడ కృత్రిమ కల్లు తయారీలో భాగంగా   వీటిని ఇష్టారీతిగా నీటిలో కలుపుతున్నారు. ఈ మత్తు పదార్థాలతో పాటు తియ్యదనం కోసం షాక్రిన్ వేస్తున్నారు. నురగ రావాలని కుంకుడు కాయల రసం కలుపుతున్నారు. వీటన్నింటి సహాయంతో కల్తీ కల్లు తయారీ అవుతుంది. నామమాత్రంగా చెట్టు కల్లు కలిపి అమ్మకాలు చేస్తున్నారు. నిజం తెలియని జనాలు, కల్తీ కల్లు తాగి, ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.రసాయనాలతో తయారు చేసిన కల్లు సేవించే వారి ఆరోగ్యం క్రమేణా దెబ్బతింటోంది. ముఖ్యంగా నరాల బలహీనత, కీళ్ల నొప్పులు, మతి మరుపు, మతిస్థిమితం కోల్పోవడం, గుండె జబ్బులు, కిడ్నీ దెబ్బతినడం, ఆస్తమా లాంటి రోగాలు వస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో రక్త ప్రసరణలో  తేడాతో గుండె పోటు వస్తుంది. ఇలాంటి మరణాలు గతంలో రాష్ట్ర ప్రభుత్వం కల్లు అమ్మకాలు నిలిపివేసిన సమయంలో చూసిన విషయం తెలిసిందే. అలాగే సైకియాట్రిస్ట్ లు  ఈ రోగులకు ఓ గ్లాస్ కృత్రిమ కల్లు తాగించి, వైద్యం చేస్తున్న విషయం విదితమే. తాజాగా నాలుగు రోజుల కిందట బోధన్ మండలంలోని సంఘం గ్రామంలో జరిగిన కల్తీ కల్లు సంఘటనలో బాధితులు చెప్పిన విషయాలు, చూసిన దృశ్యాలు కృత్రిమ కల్లు ఎంత ప్రమాదకరమో తెలియజేస్తున్నాయి.కల్తీ కల్లు అమ్మకాలను అరికట్టాల్సిన అధికారులు నెలవారీ మామూళ్ల మత్తులో జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తనిఖీలు చేపట్టకుండా నిద్ర పోతున్నారు. ప్రజలు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదు. ఈత వనాల పెంపు దిశగా ఆలోచనలు చేయడం లేదు. పరీక్షల కోసం కనీసం శాంపిల్స్ సేకరణ సైతం తీసుకోవడం లేదు. దీంతో కల్లు మాఫియా రాజకీయ నాయకుల అండతో రెచ్చిపోతుంది. కృత్రిమ దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తోంది. దీనిని ఆపకపోతే పరిస్థితులు మరింత విషమించే స్థితి నెలకొంది.ఈ మధ్య ఓ కల్లు ప్రియుడికి కరోనా సోకింది. చికిత్స కోసం బాన్సువాడ ఏరియా ఆసుపత్రిలో చేర్చారు. ఆ రోజు సాయంత్రం రోగి ఆసుపత్రి నుంచి పారిపోయాడు. రోగి సంబంధీకుల నుంచి వివరాల సేకరణ అనంతరం స్థానిక కల్లు బట్టిలో అతన్ని పట్టుకున్నారు. కల్లు తాగడానికి వచ్చానని, మీరు రోజూ కల్లు ఇస్తే తప్ప ఆసుపత్రిలో ఉండనని తేల్చి చెప్పాడు. గత్యంతరం లేని పరిస్థితుల్లో వైద్య సిబ్బంది ఆ డిమాండ్‌కు ఒప్పుకొని , ఆసుపత్రికి తరలించారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నిత్య కృత్యం. అంతేకాదు  కల్లు కోసం కొన్ని కల్లు విక్రయ కేంద్రాల్లో హత్యలు జరిగిన సంఘటనలు ఉన్నాయి.

Related Posts