విజయవాడ డిసెంబర్ 24
సీజేఐ ఎన్వీ రమణ శుక్రవారం పొన్నవరంలోని తన సోదరుడి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు ఏపీ ప్రభుత్వం తరపున గౌరవ వందనం చేశారు. మంత్రులు పెద్దిరెడ్డి, పేర్ని నాని, అధికార యంత్రాంగం భారీ స్వాగతం పలికారు. అనంతరం పొన్నవరంలో టీటీడీ వేదపండితుల ఆశీర్వచనంతో జ్యోతి ప్రజ్వాలన గావించి పౌర సన్మాన సభను ఎన్వీ రమణ దంపతులు ప్రారంభించారు. పొన్నవరం గ్రామ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జనని జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అంటూ ఎన్వీ రమణ ఉపన్యాసాన్ని ప్రారంభించారు. ’’పొన్నవరం చాలా చైతన్యం ఉన్న ఊరు. ఈ పల్లె ప్రజల ఆశీర్వచనాల కోసం వచ్చాను. నేను ఎక్కడకు వెళ్లినా నా ఊరు ఇదే అని మర్చిపోలేదు. నా చిన్నతనంలో ఏ రకంగా ఇబ్బంది పడలేదు. మా ఊరులో రాజు మాస్టర్ వీధి బడి ఉండేది. రాజు, మార్కండేయులు మాస్టర్లు ఏ నాడు దండించలేదు. 5వ తరగతి వరకు ఇక్కడ. ఏడాది తర్వాత జమ్మవారం కంచికచర్లలో చదువుకున్నా. మా ఊరులో ఏ రోజూ ఏ ఘర్షణ ఉండదు. కులమత తారతమ్యాలు ఇక్కడ ఉండవు. పుట్టిన ఊరుని, కన్నతల్లిని మరచిపోకూడదు. ఢిల్లీకి పోయినా ఈ పల్లెను గౌరవిస్తా. ఆర్భాటంగా ఉండని స్కూలులో చదివాను. నాకు పదేళ్లు వచ్చేసరికే మా ఊర్లో మూడు ప్రధాన రాజకీయపార్టీలు ఉండేవి. మా తండ్రి కమ్యూనిస్ట్ భావజాలంతో ఉంటే నేను స్వాతంత్య్ర పార్టీకి మద్దతిచ్చా. కమ్యూనిస్ట్ పార్టీ డౌన్ డౌన్ అని నినాదాలు చేశాం. చిన్నతనంలో ఎన్జీరంగా మీటింగ్‌లకు వెళ్లా. అప్పట్లో ఈ ప్రాంతం దుర్భిక్ష మెట్టప్రాంతంగానే ఉంది. నేటికి మా ప్రాంతం అనుకున్న అభివృద్ధి సాధించకపోవడం ఆవేదన కలిగిస్తోంది. ఢిల్లీలో తెలుగువాడినని చెపితే అక్కడివారు తమ ప్రాంతంలో పలు ప్రాజెక్ట్‌లు కట్టారని చెపుతారు. ఆఫ్గానిస్తాన్ లాంటి ప్రాంతంలో సైతం పార్లమెంట్‌ను నిర్మించిన ఘనత మన తెలుగు వాళ్లకు దక్కుతుంది. రైతులకు కనీస మద్దతు ధర, భూవివాదాలు వంటి ఇబ్బందులు అలాగే ఉన్నాయి. దేశం అన్ని రంగాలలోనూ ముందుకెళ్తోంది. సమస్యలను అధిగమించాలంటే అందరూ కలిసి పనిచేయాలి. తెలుగుజాతి గొప్పతనం తెలిపేలా, గర్వించదగిన విధంగా ప్రవర్తించాలి. ఢిల్లీలో చాలా సభల్లో తెలుగువాడి గొప్పతనం గురించి మాట్లాడుకుంటారు. కరోనా వ్యాక్సిన్ తయారు చేసిన భారత్ బయోటెక్ కూడా తెలుగు వారైనందుకు గర్వపడాలి’’ అని సీజేఐ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు.