హైదరాబాద్, డిసెంబర్ 24,
తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. సినిమాల విడుదల సమయంలో టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. అధికారుల కమిటీ సిఫారసుల మేరకు టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్టు తెలంగాణ ప్రభుత్వం పేర్కొంది. తాజా ఉత్తర్వుల ప్రకారం ఏసీ థియేటర్లలో 50 నుంచి 150 రూపాయల వరకు ధర ఉండొచ్చని స్పష్టం చేసింది. మల్టీప్లెక్స్‌ల్లో అయితే రూ.100-250ల మధ్య, మల్టీప్లెక్స్‌ల్లో రిక్లైనర్ సీట్లకు గరిష్ఠంగా 300 రూపాయలు వసూలు చేసుకోవచ్చని చెప్పింది.సినిమా టికెట్ ధరల పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ థియేటర్ల యజమానులు గతంలో హైకోర్టును ఆశ్రయించారు. వారి విన్నపాన్ని మన్నించిన ఉన్నత న్యాయస్థానం టిక్కెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలోనే టిక్కెట్ ధరల ఖరారుకు రాష్ట్ర ప్రభుత్వం అధికారుల కమిటీని నియమించింది. సినీరంగ ప్రముఖులతో చర్చలు జరిపిన కమిటీ ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేసింది. వాటి ఆధారంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు తాజాగా ఉత్తర్వులు జారీచేసింది