హైదరబాద్, డిసెంబర్ 27,
మిషన్ 70. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ముందున్న టార్గెట్. వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు కమలనాథులు. కొన్నిచోట్ల ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట. ఇంఛార్జుల వేటలో పడినట్టు చెబుతున్నారు.తెలంగాణలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలుంటే.. బీజేపీ బలం ముచ్చటగా ముగ్గురు ఎమ్మెల్యేలు. అందులో రెండు ఉపఎన్నికల్లో గెలిచినవే. 2018 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోయిన స్థానాలు ఎక్కువే. అయితే ఉప ఎన్నికల్లో గెలిచామన్న ధీమానో ఏమో.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం బీజేపీదే అని భారీ ప్రకటనలు చేస్తున్నారు కమలనాథులు. వచ్చే ఎన్నికల్లో 70 చోట్ల గెలిచి అధికారంలోకి వస్తామని బీజేపీ రాష్ట్ర ఇంఛార్జ్ తరుణ్ చుగ్ ప్రకటించారు. ఆ స్టేట్‌మెంట్ పార్టీ నేతలకు.. శ్రేణులకు ఉత్సాహం తీసుకొచ్చి ఉండొచ్చు. కానీ.. నేల విడిచి సాము చేస్తే ఎలా అన్నదే పార్టీలో కొందరి వాదన. 70ని రీచ్ కావాలంటే ఏం చేయాలన్న దానిపై బీజేపీ నేతలు దృష్టి పెట్టారు. దీంతో క్షేత్రస్థాయిలోని విషయాలను వారిని భయపెడుతున్నట్టు సమాచారం. వారి ఆలోచనలు.. చర్చలు 119 నియోజకవర్గాల్లో కీలకమైన 31 ఎస్సీ, ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల దగ్గర ఆగిపోయింది. ఈ 31 నియోజకవర్గాల్లో 19 ఎస్సీ, 12 ఎస్టీ సెగ్మెంట్లు. ఇవి కాకుండా MIM పాగా వేసిన నియోజకవర్గాలు 7. వెరసి 119లో 38 నియోజకవర్గాలు బీజేపీకి దూరంగానే ఉన్నాయి. మిగిలిన 81లో ఎన్ని బీజేపీకి వస్తాయన్నది ఒక ప్రశ్న. అందుకే 31 రిజర్వ్డ్ నియోజకవర్గాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు బీజేపీ నేతలు.ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో బీజేపీ బలోపేతం కాకపోతే.. 31లో మెజారిటీ సీట్లు కైవశం చేసుకోకపోతే మిషన్ 70 కష్టమన్నది కాషాయ శిబిరంలో అంతర్గతంగా జరుగుతున్న చర్చ. ఇప్పటి నుంచే ఆ 31 స్థానాలపై కసరత్తు చేయాలనే అభిప్రాయానికి వచ్చారట. ముందుగా ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాల్లో బలమైన నేతలను ఇంఛార్జులను ఎంపిక చేయడం కమలనాథులకు పెద్ద సవాల్. అందుకే ఎస్సీ నియోజకవర్గాలకు చెందిన బీజేపీ నేతలు.. ఆ సామాజికవర్గానికి చెందిన ప్రముఖులతో ఒక వర్క్‌షాప్ పెట్టాలనే ఆలోచన పార్టీలో ఉందట. అంతేకాదు.. రెగ్యులర్‌గా అక్కడ పార్టీ కార్యక్రమాల స్పీడ్ పెంచాలనే నిర్ణయానికి వచ్చారట.కేవలం పార్టీ కార్యక్రమాలను పెంచడమే కాకుండా.. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల్లో బలమైన నాయకులను బీజేపీలోకి తీసుకొచ్చే పనిపై కసరత్తు చేస్తున్నారు. అక్కడ ప్రభావం చూపగలిగే ఇతర సామాజికవర్గాల నేతలకు కషాయ కండువా కప్పేపని కొందరికి అప్పగించారట. అమిత్ షా త్వరలో రాష్ట్రానికి వచ్చి రెండురోజులు ఉంటానని చెప్పడంతో.. ఆ సమయాన్ని పెద్ద నాయకుల చేరికకు ఉపయోగించే ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తితో ఉన్న నాయకులతో టచ్‌లోకి వెళ్లారట. అయితే ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ఇప్పుడు ఆదరాబాదరాగా నిర్ణయం తీసుకోవడం కంటే.. ఆ పనేదో ముందు నుంచీ చేసి ఉంటే ఇప్పటికే మంచి ఫలితాలు వచ్చేవన్నది పార్టీలో కొందరి అభిప్రాయం. మరి.. ఈ కొత్త టాస్క్‌లో తెలంగాణ కమలనాథులు ఎంత వరకూ సక్సెస్ అవుతారో చూడాలి.