YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్

రెండు రాష్ట్రాల్లో ఓటర్లు...

రెండు రాష్ట్రాల్లో ఓటర్లు...

హైదరాబాద్, డిసెంబర్ 27,
నేను తెలుగు భాష లెక్క.. ఆడా ఉంటా.. ఈడా ఉంటా” ఇది ఓ సినిమా డైలాగ్. ఆ డైలాగ్‌‌కు తగ్గట్లుగానే చాలా మంది ‘‘నేను తెలుగు ఓటర్‌‌‌‌ను.. ఆడా ఓటేస్తా.. ఈడా ఓటేస్తా’’ అంటున్నారు. ఇలా ఒక్కరో ఇద్దరో కాదు.. ఏపీ, తెలంగాణలో రెండు చోట్ల ఓటు హక్కు ఉన్నోళ్లు లక్షల్లోనే ఉన్నారు. అక్కడా, ఇక్కడా ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఓట్లు వేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ డబుల్ ఓటర్లకు చెక్ పెట్టేలా కేంద్ర ప్రభుత్వం ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లును తీసుకొచ్చింది. ఓటర్, ఆధార్ కార్డుల లింకుతో బోగస్, మల్టిపుల్ ఓట్లు ఇకపై గల్లంతు కానున్నాయి. డబుల్, మల్టిపుల్, బోగస్ ఓటర్లుగా నమోదైన వారు రాష్ట్రంలో 30 లక్షల నుంచి ఏపీకి చెందిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. 2018లో ఇక్కడ.. 2019లో అక్కడ. 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. ఏండ్ల నుంచి తెలంగాణలో ఉన్న ఏపీ వాళ్లు ఇక్కడే ఓటర్ కార్డు తీసుకున్నారు. ఏపీలో ఉన్న ఓటర్ కార్డును అలానే కొనసాగించారు. దీంతో ఇక్కడా, అక్కడా ఓటర్లుగా నమోదయ్యారు. ఇతర రాష్ట్రాల వారికీ ఇక్కడ ఓట్లున్నాయి. వీరంతా ఎక్కువగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉంటున్నారు. కేసీఆర్ సర్కారు 2018లో ముందస్తు ఎన్నికలకు పోవడంతో ఇక్కడ ఓట్లు వేశారు. 2019లో ఏపీ సహా దేశవ్యాప్తంగా సాధారణ ఎన్నికలు జరిగాయి. అప్పుడు ఏపీకి వెళ్లి తమ ఓటు వేశారు. గత ఎన్నికల సమయంలో ఏపీలోని ప్రధాన రాజకీయ పార్టీల నేతలు అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా తెలంగాణలోని తమ ఓటర్లను గుర్తించి ‘స్పెషల్ ప్యాకేజీలు’ ఇచ్చారు. ఓటుకు రూ.2 వేల నుంచి రూ.5 వేల దాకా ఇచ్చి వెహికల్స్‌‌‌‌లో తరలించారు. రెండు సార్లు జరిగిన జీహెచ్‌‌‌‌ఎంసీ ఎన్నికల్లోనూ ఏపీ వాళ్లు ఓట్లు వేశారు. ఏపీలో జరిగిన మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేసి వచ్చారు. సర్పంచ్ ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం కాబట్టి ఒక్కొక్కరికి రూ.5 వేల నుంచి రూ.10 వేల దాకా అందుకున్నారు.
కోటి జనాభా.. 90 లక్షల ఓటర్లు
గ్రేటర్ హైదరాబాద్‌‌‌‌లో కోటి మంది జనాభా ఉంటే.. 90 లక్షల మంది దాకా ఓటర్లు ఉన్నారు. దాదాపు జనాభాతో సమానంగా ఓటర్లు ఉన్నారు.. రాష్ట్రంలో డబుల్, బోగస్ ఓటర్ల సంఖ్యకు నిదర్శనమిది. శంషాబాద్, షాద్నగర్, కొత్తూరు, జడ్చర్ల వంటి ప్రాంతాల్లో ఏపీతోపాటు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు అధికంగా నివసిస్తున్నారు. వీరిలో మెజార్టీ ప్రజలు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉన్నామని బహిరంగంగానే చెబుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం ఓటర్లు
పురుషులు     1,52,57690
మహిళలు     1,50,97,292
ట్రాన్స్‌‌‌‌జెండర్లు     1,683
సర్వీస్ ఓటర్లు     1,450
జీహెచ్ఎంసీ ఓటర్లు
పురుషులు     38,56,770
మహిళలు     35,46,847
ట్రాన్స్‌‌‌‌జెండర్లు     649

Related Posts