YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

కర్ణాటకలో చివరి నిమిషంలో మారిన సమీకరణాలు

కర్ణాటకలో చివరి నిమిషంలో మారిన సమీకరణాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుడిగాలి పర్యటనలతో బీజేపీ కర్ణాటకలో పుంజుకుందా? మేజిక్ ఫిగర్ కు చేరువయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదా? అవుననే అంటున్నాయి సర్వేలు. కర్ణాటకలో నిన్న మొన్నటి దాకా హంగ్ ప్రభుత్వం ఏర్పడుతుందని సర్వేలు తేల్చాయి. కాంగ్రెస్ కర్ణాటకలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవిస్తుందని, రెండో స్థానాలో బీజేపీ ఉంటుందని పలు సర్వేలు తేల్చి చెప్పాయి. అయితే ప్రధాని మోడీ ఉధృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించిన తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకున్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో మొత్తం 223 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే అధికారంలోకి రావాలంటే 113 స్థానాలను ఏ పార్టీ అయినా సాధించాలి.కర్ణాటకలో ఒక సెంటిమెంట్ ఉంది. అధికారంలో ఉన్న ఏ పార్టీ తిరిగి పవర్ లోకి ఇంతవరకూ రాలేదు. అదే సెంటిమెంట్ తిరిగి పునరావృతమవుతుందంటున్నారు. సర్వేలు కూడా హంగ్ అసెంబ్లీ వస్తుందని చెప్పినా ఆ అవకాశం లేదంటున్నారు. ఆర్ఎస్ఎస్ చేయించిన సర్వేలో బీజేపీ పుంజుకుందని తేలడంతో కమలం పార్టీలో ఉత్సాహం నెలకొంది. బాంబే కర్ణాటక, హైదరాబద్ కర్ణాటక, మధ్య కర్ణాటకల్లో బీజేపీ నాలుగు రోజుల నుంచి బలం పెరిగిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో బీజేపీ అటుఇటుగా మేజిక్ ఫిగర్ ను చేరుకుంటుందన్న అంచనాకు కమలనాధులు కూడా వచ్చారు.సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తి కొంత, యడ్యూరప్ప పై సానుభూతి వెరసి బీజేపీకి బలం తెచ్చిపెట్టాయన్నది విశ్లేషకుల అంచనా. మాజీ ప్రధాని దేవెగౌడ కూడా హంగ్ అసెంబ్లీ గురించి మాట దాట వేశారు. తమ పార్టీ కూడా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో పోటీ ఇస్తుందని చెప్పారు. అయితే హంగ్ వచ్చినప్పుడు తమ పార్టీ సరైన నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. రెండు జాతీయ పార్టీలూ కర్ణాటక ఎన్నికల్లో కోట్లాది రూపాయలు కుమ్మరిస్తున్నాయని, అయినా తాము మైసూరు, బాంబే కర్ణాటక, హైదరాబాద్ కర్ణాటకల్లో సత్తా చాటుతామని చెప్పారు. మొత్తం మీద పోలింగ్ కు ముందు పార్టీ పుంజుకుందన్న వార్తలు కమలనాధుల్లో జోష్ ను పెంచాయనే చెప్పాలి.మూడు రోజులక్రితం ఇండియా టీవీ సర్వేలో సయితం హంగ్ వస్తుందనే తేల్చింది. ఈ సర్వేలో కాంగ్రెస్ 96 స్థానాలను కైవసం చేసుకుంటుందని ఇండియా టీవీ సర్వే తేల్చి చెప్పింది. తర్వాత స్థానంలో బీజేపీ 86 స్థానాలను, జనతాదళ్ ఎస్ కు 38 నుంచి నలభై స్థానాలు వస్తాయని పేర్కొంది. అయితే ఇండియా టీవీ సర్వే ప్రధాని మోడీ కర్ణాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహించక ముందు చేసింది. అయితే మోడీ పర్యటనలు, ప్రచారం తర్వాత బీజేపీ అనూహ్యంగా పుంజుకుంటుందన్న వార్తలు వస్తున్నాయి.

Related Posts