YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో భారీగా తగ్గిన దిగుబడులు

ఏపీలో భారీగా తగ్గిన దిగుబడులు

విజయవాడ, డిసెంబర్ 28,
తుపాన్లు, వరదలు, కరువుల దాడికి ఖరీఫ్‌లో సుమారు పదకొండు లక్షల టన్నుల ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గనున్నాయి. ఆగస్టులో ప్రభుత్వం వేసిన మొదటి ముందస్తు అంచనాల్లో 89.43 లక్షల టన్నుల ఆహార ధాన్యాలను ఆశించగా ప్రస్తుతం తాజాగా రూపొందించిన రెండవ ముందస్తు అంచనాల్లో 72.37 లక్షల టన్నులకు తగ్గించింది. నిరుడు 87.64 లక్షల టన్నులు లభించగా ఈ ఏట అంతకంటే 9.2 లక్షల టన్నులు తగ్గనున్నాయి. ఈ మారు సీజన్‌ మొదట్లో నైరుతి రుతుపవనాలు అనుకూలంగా మారడంతో సాగు ఆశాజనకంగా సాగింది. అయితే జూన్‌ మొదలుకొని నవంబర్‌ వరకు పలు ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదు కావడంతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు గోదావరి, కృష్ణ నదులు రెండు తడవలు ఉప్పొంగడంతో పంటలకు అపార నష్టం వాటిల్లింది. మరో వైపు ఉత్తరాంధ్రలో తిష్ట వేసిన కరువు సాగును ఆటంకపరిచింది. అతివృష్టి, అనావృష్టి వలన పంటలకు తెగుళ్లు వ్యాపించాయి. ఈ పరిస్థితుల ప్రభావం వలన ఈ సారి దాదాపు అన్ని పంటల ఉత్పత్తి, ఉత్పాదకత పడిపోతుందని సర్కారు అంచనా వేసింది. తుది లెక్కలచ్చేసరికి దిగుబడులు ఇంకా తగ్గే అవకాశం ఉంది.ఆహార ధాన్యాల్లో ప్రధానమైన వరి దిగుబడి సైతం తగ్గనుంది. సాగు ఇంచుమించు గతేడాదంతా అయింది. ఉత్పాదకత బాగా పడిపోయింది. నిరుడు హెక్టారుకు 5.24 టన్నుల ఉత్పాదకత లభించగా, ఈ ఏడాది మొదటి ముందస్తు అంచనాల్లో 5.09 టన్నులు ఆశించారు. కాగా రెండవ ముందస్తు అంచనాల్లో 4.52 టన్నులకు తగ్గించారు. దాని ప్రకారం ముందుగా 81.48 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతుందని పేర్కొని, ఇప్పుడు 72.37 లక్షల టన్నులకు తగ్గించారు. మొదటి అంచనాల కంటే రెండవ అంచనాల్లో 9.22 లక్షల టన్నులు తగ్గుతున్నాయి. నిరుడు 79.98 లక్షల టన్నులు లభించాయి. గతేడాది కంటే ఈ తడవ 7.61 లక్షల టన్నులు తగ్గనున్నాయి. చిరుధాన్యాల్లో ముఖ్యమైన మొక్కజన్నతో పాటు ఖరీఫ్‌లో సాగైన అన్ని రకాల పప్పుధాన్యాల ఉత్పత్తి, ఉత్పాదకత నిరుటి కంటే, ఈ ఏడాది మొదటి ముందస్తు అంచనాల కంటే తగ్గుతున్నాయి.నూనెగింజల్లో ప్రధానమైన వేరుశనగ దిగుబడులు సైతం తగ్గాయి. మొదటి ముందస్తు అంచనాల్లో 7.33 లక్షల టన్నుల దిగుబడులస్తాయనుకోగా ప్రస్తుతం 5.47 లక్షల టన్నులకు అంచనాలను కుదించారు. ఉత్పాదకత హెక్టారుకు 957 కిలోల నుంచి 735 కిలోలకు తగ్గించారు. నిరుడు 6.22 లక్షల టన్నుల దిగుబడి, 1,095 కిలోల ఉత్పాదకత లభించింది. వాణిజ్య పంటల్లో ముఖ్యమైన పత్తి ఒక్కటే మొదటి ముందస్తు అంచనాల కంటే రెండవ ముందస్తు అంచనాల్లో ఉత్పత్తి పెరుగుతుందని చూపారు. తొలుత 17.70 లక్షల బేళ్ల నుంచి 19.43 లక్షల బేళ్లకు దిగుబడిని పెంచారు. ఉత్పాదకత మాత్రం రెండు అంచనాల్లోనూ 547 కిలోలుగా అంచనా వేశారు. కాగా నిరుడు 24.97 లక్షల బేళ్ల దిగుబడి వచ్చింది. ఉత్పాదకత 649 కిలోలు లభించింది.

Related Posts