విజయవాడ, డిసెంబర్ 28,
రాజధాని పరిస్థితి ఎటూ తేలకపోవడంతో పెళ్లీడుకొచ్చిన పిల్లల పరిస్థితి డోలాయమానంలో పడింది. పూలింగు హడావిడి నడిచిన సమయంలో ఇక్కడ అమ్మాయి, అబ్బాయి అంటే దేశ విదేశాల నుండి వచ్చి ఎగబడి మరీ పెళ్లిళ్లు కుదుర్చుకునేవారు. ప్రస్తుత పరిస్థితి దానికి భిన్నంగా మారింది. ఇక్కడ ఆడపిల్లలంటే చూద్దాములే అనే పరిస్థితి ఏర్పడింది. పూలింగు సమయంలో ప్రతి రోజూ ఏదో ఒక ఊరిలో పెళ్లిళ్ల ఫంక్షన్లకు అందరూ కలిసి వెళ్లేవారు. అన్నీ కళకళలాడుతూ ఉండేవి. ప్రస్తుతం అవేమీ జరగడం లేదు. భూములకు విలువ తగ్గడంతో ఎవరూ ముందుకు రావడం లేదు. దీనికితోడు పెళ్లిళ్లు చేసిన వారూ చేసిన అప్పులు తీర్చలేక నానా అవస్థలు పడుతున్నారు. గతంలో పెళ్లిళ్లు చేసినా అంతో ఇంతో సొంత పొలం, కొంత కౌలు చేసుకుని వచ్చే ఆదాయంతో అప్పులు తీర్చుకునేవారు. ప్రస్తుతం ఆదాయం లేదు. పొలానికి విలువా లేదు. మరోవైపు అప్పు ఇచ్చిన వారి ఒత్తిడి పెరిగిపోతోంది.రాజధాని పరిధిలోని వెంకటపాలెం గ్రామానికి చెందిన రైతు లంకా ప్రభాకరరావు ఎకరా 40 సెంట్ల భూమున్న రైతు. కొంత కౌలు చేసుకుంటారు. దీనిలో కొంత భూమిని అమ్ముకున్నారు. 60 సెంట్లు పూలింగుకు ఇచ్చారు. ఇతనికి ఇద్దరు కుమార్తెలు. 2014 తరువాత వారిద్ద్దరికీ పెళ్లిళ్లు చేశారు. దీనికోసం కొంత అప్పు అయ్యింది. పూలింగు ప్రక్రియ సాగడంతో భూములకు విలువ వస్తుందని, అమ్ముకుని అప్పు తీర్చుకోవచ్చను కున్నారు. కొంత భూమిని అమ్ముకున్నా అనారోగ్య పరిస్థి తుల్లో ఉన్న డబ్బంతా అయిపోయింది. ఒక్కసారి పరిస్థితి మారిపో వడంతో భూములకూ విలువ లేకుండా పోయింది. అదే ఊరిలో ఉన్న భూమిలో ఇళ్లు కట్టుకుందామని ఉన్న రేకుల ఇంటిని పడగొట్టారు. కట్టుబడి మొదలుపెట్టే సమయానికి రాజధాని మారుతుందనే ప్రకటన, బ్యాంకర్లు లోను ఇవ్వబోమని చెప్పడంతో పూలింగుకు భూమి ఇచ్చింది గాక, ఉన్న స్థలంలో కొంత భూమిని కూడా అమ్ముకోవాల్సి వచ్చింది.గ్రామానికి చెందిన శ్రీరామచంద్రమూర్తి నలుగురు అన్నదమ్ములు. ఒక పెంకుటిల్లు అందరూ దాన్ని పంచుకోవాలి. ఉన్న ఎకరం భూమిని పూలింగుకు ఇచ్చారు. శ్రీరామచంద్రమూర్తి కుమారుడు బెంగుళూరులో ఉద్యోగం చేసుకుంటున్నాడు. గతంలో పిల్లను ఇస్తామని వచ్చారు. వచ్చిన భూమిలో ఇల్లు నిర్మించుకుని పెళ్లి చేసుకుందామని ఆగారు. ఇంతలో రాజధాని మార్పు ప్రకటన వచ్చింది. ప్రస్తుతం ఎక్కడకెల్లి పిల్లను చూసినా రాజధాని గ్రామం అనే సరికి ఆలోచిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదే గ్రామానికి చెందని పరాశరం వెంకట రమణాచార్యులు కూడా అక్కడే ఉన్న సీతారామస్వామి దేవస్థానం భూములపై ఆధారపడి, అర్చకత్వం చేసుకుంటూ జీవనం సాగించేవారు. వారిది ఎనిమిది మంది సంతానం. పూలింగులో దేవస్థానం భూమిని తీసుకున్నారు. వాటిల్లో సాగు ఉంటే కౌలు తీసుకుని కుటుంబాన్ని పోషించుకునేవారు. ప్రస్తుతం అర్చకత్వం మాత్రమే ఉంది. రైతుల వద్దా డబ్బులు లేకపోవడంతో ఒకప్పుడు ఎంతో సంతోషంగా సాగిన కుటుంబం కొంత ఇబ్బందులు ఎదుర్కొంటోంది. రాజధాని పరిధిలోని ఏ గ్రామంలో చూసినా ఇదే పరిస్థితి.