విజయవాడ, డిసెంబర్ 28,
వంగవీటి రాధా సంచలన కామెంట్స్ చేశారు. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని చెప్పారు. అయితే ఆయన కామెంట్స్ చేసి 24 గంటలు కావస్తున్నా తెలుగుదేశం పార్టీ నుంచి రెస్పాన్స్ రాలేదు. ఎవరూ దీనిపై మాట్లాడ లేదు. వంగవీటి రాధా ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధా తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటి నుంచి ఆయన పెద్దగా యాక్టివ్ గా లేకపోయినా అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల్లో పొల్గొంటున్నారు.. చిన్న కార్యకర్తపై కేసు పెడితేనే టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ వెంటనే ట్విట్టర్ లో స్పందించే వారు. అలాంటిది వంగవీటి రాధా వంటి నేతపై హత్యకు కుట్ర జరిగిందని, ఆయన స్వయంగా ప్రకటించినా టీడీపీ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. దీనికి కారణాలేంటన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతుంది. వంగవీటి రాధా టీడీపీ నుంచి జంప్ చేసేందుకే ఈ వ్యాఖ్యలు చేశారన్న అభిప్రాయం టీడీపీలో వ్యక్తమవుతుంది.తనను హత్య చేయడానికి కుట్ర చేస్తున్నారంటూ వంగవీటి రాధా కామెంట్స్ చేసినప్పుడు పక్కనే మంత్రి కొడాలి నాని ఉన్నారు. టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఉండటాన్ని టీడీపీ అగ్రనేతలు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది. వారిద్దరే కావాలని వంగవీటి రాధా చేత ఈ కామెంట్స్ చేయించారా? పార్టీ నుంచి వెళ్లిపోయే కారణాలు వెతుక్కునేందుకు రాధా ఇటువంటి వ్యాఖ్యలు చేశారా? అన్న అనుమానమూ లేకపోలేదు. పార్టీ నుంచి వెళ్లిపోయేందుకేనా? వంగవీటి రాధా టీడీపీలో ఉన్నప్పటికీ వైసీపీ నేతలతోనూ, పార్టీని విభేదించిన వాళ్లతో చెట్టాపెట్టాలేసుకుని తిరుగుతుండటం టీడీపీ అగ్రనాయకత్వం అనుమానిస్తుంది. ఇది భవిష్యత్ లో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశాలున్నాయని భావిస్తుంది. అందుకే చంద్రబాబు కానీ పార్టీ నేతలు కానీ వంగవీటి రాధా కామెంట్స్ ను లైట్ గా తీసుకున్నారంటున్నారు. టీడీపీ స్థానిక నాయకత్వం కూడా దీనిపై స్పందించడం లేదు. మొత్తం మీద వంగవీటి రాధా హత్యకు కుట్ర చేసిందెవరన్నది ఆయన అయినా స్వయంగా చెప్పాలి. లేకుంటే పోలీసులైనా తేల్చాలి
కుట్ర వెనుక ఎవరు
వంగవీటి రాధా ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందా? రాధాను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? రాధా ఎందుకు ఈ ఆరోపణలు చేశారు? కావాలనే చేశారా? లేక నిజంగానే రాధాపై హత్యకు కుట్ర జరిగిందా? దానిపై పోలీసులు పూర్తి స్థాయి విచారణ చేపడితే కాని వాస్తవాలు బయటకు రావు. నిన్న వంగవీటి రాధా తనపై హత్యకు కుట్ర జరిగిందని, రెక్కీ కూడా నిర్వహించారని ఆరోపించడంతో ఇది హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి రాధా ను హత్య చేసేందుకు కుట్ర జరిగిందట. ఈ నెల అక్టోబరు 19వ తేదీన రెక్కీ నిర్వహించినట్లు రాధా చెబుతున్నారు. అయితే దాదాపు రెండున్నర నెలలయినా రాధా ఈ విషయాన్ని ఎందుకు గోప్యంగా ఉంచారు? అన్నది చర్చనీయాంశమైంది. తన తండ్రి వర్ధంతి రోజునే ఈ ఆరోపణలు చేయాల్సిన అవసరం ఏంటి? అసలు రాధాను చంపే అవసరం ఎవరికి ఉంటుంది? ఆయనపై హత్యకు కుట్ర చేసిందెవరు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎవరికి అవసరం? నిజానికి వంగవీటి రాధాను హత్య చేసే అవసరం రాజకీయంగా ఎవరికి ఉండదు. ఎందుకంటే ఆయన దాదాపు దశాబ్దన్నర కాలంగా రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపడం లేదు. వరస ఎన్నికల్లో ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో వంగవీటి రాధా పోటీ కూడా చేయలేదు. ఆయన ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పటికీ రాజకీయంగా పెద్దగా శత్రువులు ఎవరూ లేరు. అందరూ సన్నిహితంగా ఉండేవారే. ఇక బెజవాడ ఫ్యాక్షన్ రాజకీయాలకు తెరపడి దశాబ్దకాలం పైనే అవుతుంది. బలమైన రెండు వర్గాలు ఎవరికి వారు తమ పని తాము చూసుకుంటున్నారు. రాజకీయంగా పైకి ఎదగాలన్న ధ్యాస తప్ప హత్యా రాజకీయాలపై ఎవరూ దృష్టి పెట్టడం లేదు. మరి రాధాను ఎవరు చంపేందుకు కుట్ర పన్నారన్న విషయం తెలియాలంటే పోలీసులు లోతైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రాధా తన రాజకీయ ఎదుగుదల కోసం ఈ ఆరోపణలు చేశారా? నిజంగానే కుట్ర జరిగిందా? అన్నది ప్రజలకు తెలియాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విచారణకు ఆదేశించే అవకాశముంది.