YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణ నేతలకు గ్రేడింగ్ టెన్షన్

తెలంగాణ నేతలకు గ్రేడింగ్ టెన్షన్

ఎన్నికలు స‌మీపిస్తున్న త‌రుణంలో గులాబీ బాస్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా..? సిట్టింగ్ ఎమ్మెల్యేల‌కు గ్రేడింగ్ ఇచ్చిన‌ట్లే నియోజ‌క‌వ‌ర్గాల‌కూ ఇచ్చారా..? వ‌చ్చే ఎన్నిక‌ల్లో స‌గానికిపైగా నియోజ‌క‌వ‌ర్గాల్లో టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్య‌త ఆ ముగ్గురికే అప్ప‌గించారా..? కొద్దిరోజులుగా మంత్రులు కేటీఆర్, హ‌రీశ్‌, ఎంపీ క‌విత సెలెక్ట‌డ్ నియోజ‌క‌వ‌ర్గాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేప‌ట్ట‌డం ఇందులో భాగ‌మేనా..? అంటే ఇటీవ‌ల పార్టీలో చోటు చేసుకుంటున్న‌ప‌రిణామాలు నిజ‌మ‌నే అంటున్నాయి. కొద్దిరోజులుగా మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌రావు, ఎంపీ క‌విత‌లు ఎవ‌రూ ఊహించ‌ని విధంగా నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు. తెలంగాణ‌లో ఉన్న మొత్తంలో 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో 63 స్థానాల్లో టీఆర్ఎస్ గత ఎన్నికల్లో విజ‌యం సాధించింది. ఆ త‌ర్వాత సీఎం కేసీఆర్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష‌తో ప‌లువురు కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు అధికార టీఆర్ఎస్‌లో చేరారు. అయితే గ‌త ఎన్నిక‌ల్లో గెలిచిన నియోజ‌క‌వ‌ర్గాల్లో స‌గానికిపైగా స్థానాల్లో గులాబీకి వ్య‌తిరేక ప‌వ‌నాలు వీస్తున్నాయి. ఎమ్మెల్యేల ప‌నితీరు అధ్వానంగా ఉండ‌డం, వారి వ్య‌వ‌హార శైలి స‌రిగా లేక‌పోవ‌డం, ప‌లు అవినీతి, అక్ర‌మాల ఆరోప‌ణ‌లు రావ‌డం.. త‌దిత‌ర కార‌ణాల నేప‌థ్యంలో చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీకి తీవ్ర న‌ష్టం వాటిల్లిన‌ట్లు ఇంటెలిజెన్స్ వ‌ర్గాల ద్వారా సీఎం కేసీఆర్ ఎప్ప‌టిక‌ప్పుడు నివేదిక‌లు తెప్పించుకున్న‌ట్లు స‌మాచారం. సీఎం కేసీఆర్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పార్టీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. బ‌ల‌హీనంగా ఉన్న సిట్టింగ్ స్థానాల‌తోపాటు బ‌లంగా ఉన్న‌ ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ స్థానాల్లోనూ టీఆర్ఎస్‌ను గెలిపించే బాధ్య‌త‌ను మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌, ఎంపీ క‌విత‌కు అప్ప‌గించిన‌ట్లు స‌మాచారం. అయితే నియోజ‌క‌వ‌ర్గాల‌కు ఏ, బీ, సీ గ్రేడింగ్స్ ఇచ్చి, వారికి బాధ్య‌త‌లు అప్ప‌గించార‌నే టాక్ వినిపిస్తోంది. సుల‌భంగా గెలిచే స్థానాల‌కు ఏ గ్రేడింగ్‌, క‌ష్టంగా గెలిచే స్థానాల‌కు బీ గ్రేడింగ్‌, ఏమాత్రమూ అవ‌కాశాలు లేని స్థానాల‌కు సీ గ్రేడింగ్ ఇచ్చిన‌ట్లు తెలిసింది.ఇందులో బీ గ్రేడ్ ఉన్న సుమారు 70 స్థానాల్లో పార్టీని విజ‌య‌తీరాల‌కు చేర్చేందుకు మంత్రులు కేటీఆర్‌, హ‌రీశ్‌, ఎంపీ క‌విత ఇప్ప‌టి నుంచి పావులు క‌దుపుతున్నారు. ఇందులో భాగంగానే ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో గులాబీ నేత‌లు ప‌ర్య‌టిస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. బీగ్రేడ్ స్థానాల్లో భూపాల‌ప‌ల్లి, స్టేష‌న్‌ఘ‌న్‌పూర్‌, మానుకోట‌, డోర్న‌క‌ల్‌, ములుగు, వ‌రంగ‌ల్ తూర్పు, ప‌శ్చిమ‌, జ‌న‌గామ‌, మంథ‌ని, మునుగోడు మిర్యాల‌గూడ‌, ఇల్లందు, పిన‌పాక‌, అశ్వ‌రావుపేట‌, పెద్ద‌ప‌ల్లి, జగిత్యాల‌, మంథ‌ని, వేముల‌వాడ‌, వ‌న‌ప‌ర్తి, మాన‌కొండూరు, ఆర్మూరు, కామారెడ్డి, సూర్యాపేట‌, ఆలేరు, న‌కిరేక‌ల్‌, తుంగ‌తుర్తి, బెల్లంప‌ల్లి, వ‌ర్ధ‌న్న‌పేట‌, ఇబ్ర‌హీంప‌ట్నం, తాండూరు, నాగ‌ర్‌క‌ర్నూలు, గ‌ద్వాల‌తో పాటు ప‌లు నియోజ‌క‌వ‌ర్గాలు ఉన్నాయి.

Related Posts