YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

కరీంనగరంలో లిక్కర్ మాఫియా

కరీంనగరంలో లిక్కర్ మాఫియా

కరీంనగర్, డిసెంబర్ 28,
బీర్ల ప్రియులకు లిక్కర్ మాఫియా షాకిస్తోంది. తాము అందుబాటులో ఉంచిన బ్రాండ్లను మాత్రమే కొనాలన్న రీతిలో వ్యవహరిస్తోంది. చివరకు కొంతమంది బీరు ప్రియులు జిల్లా కలెక్టర్‌కు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోతోంది. జగిత్యాల జిల్లాలో చోటు చేసుకున్న ఈ విచిత్రం సంచలనంగా మారిందనే చెప్పాలి. రెండు మూడేళ్లుగా జగిత్యాల జిల్లాలో కింగ్ ఫిషర్ బ్రాండ్ అమ్మకాలే జరపకుండా నిలువరిస్తున్నారంటే అక్కడ ఏం జరుగుతోందో అర్థం చేసుకోవచ్చు.గతంలో జగిత్యాల జిల్లాకు చెందిన కొంతమంది అప్పటి జిల్లా కలెక్టర్‌కు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నారు. తమ జిల్లాలో కింగ్ ఫిషర్ బీర్లు అమ్మాలని కోరుతూ తమ పిటిషన్‌లో అభ్యర్థించారు. మరికొన్ని చోట్ల అయితే కింగ్ ఫిషర్ బీర్ అభిమానులు రోడ్లపైకి ఎక్కి ఆందోళనలు కూడా నిర్వహించారు. అయినప్పటికీ జిల్లాలో మాత్రం ఈ బ్రాండ్ అమ్మకాలకు నో ఛాన్స్ అని అంటున్నారు లిక్కర్ వ్యాపారులు. వినియోగదారులకు అన్ని రకాల బ్రాండ్లను అందుబాటులో ఉంచాలన్న నిబంధనలు ఉన్నప్పటికీ వ్యాపారులు మాత్రం తమకు తోచిన వాటినే అమ్మకాలు జరుపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎక్సైజ్ అధికారులు కూడా లిక్కర్ సిండికేట్ మాఫియా వ్యవహారాలను కట్టడి చేసేందుకు చొరవ తీసుకోకపోవడం కూడా విమర్శలకు దారి తీస్తోంది.తాజాగా కొత్తగా లైసెన్స్‌లు తీసుకున్న వారితో పాటు బార్ షాపుల్లో కింగ్ ఫిషర్ బ్రాండ్ అమ్మకాల కోసం ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయం తెలుసుకున్న సిండికేట్ టీం వార్నింగ్‌లు కూడా ఇచ్చినట్టు సమాచారం. కింగ్ ఫిషర్ బీర్ల అమ్మకాలు చేయించేందుకు ప్రయత్నించిన వారికి సీరియస్‌గానే హెచ్చరికలు జారీ చేయడం కలకలం సృష్టిస్తోంది. ‘‘మాకు తెలియకుండా ఎలా అమ్మేందుకు ట్రై చేస్తున్నావు.. మేం తలుచుకుంటే నీ ఉద్యోగం కూడా ఉండదు.. మా మార్జిన్ సంగతేంటో తేల్చు..’’ అంటూ ఫోన్ చేసి మరీ డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయిఅయితే బీర్ బ్రాండ్లలో కింగ్ ఫిషర్ బ్రాండ్‌కు ఎక్కువగా డిమాండ్ ఉంటుంది. ఈ బీర్ తాగేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ నేపథ్యంలో కంపెనీ కూడా వ్యాపారులకు ఇచ్చే మార్జిన్ చాలా తక్కువగా ఉంటుందని తెలుస్తోంది. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న బీర్ కావడంతో తాము వ్యాపారులకు మార్జిన్ ఎక్కువ ఇవ్వడం దేనికని కంపెనీ భావించినట్టు ఉంది. అయితే తమకు తక్కువ మార్జిన్ ఇస్తే ఈ బీర్లను అమ్మడం ఎందుకని వ్యాపారులు భావిస్తున్నట్టుగా ఉంది. కంపెనీ, వ్యాపారుల మధ్య జరిగే లాభాల వ్యవహారం వల్లే ఇక్కడ ఈ బ్రాండ్ బీర్ల అమ్మకాలకు నో ఛాన్స్ అన్నట్టుగా మారింది.వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా బ్రాండ్లను అందుబాటులో ఉంచేందుకు చొరవ చూపాల్సిన ఎక్సైజ్ అధికారులు కూడా ఈ విషయంలో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వం విక్రయించేందుకు ఆమోదించిన బ్రాండ్లను అమ్మేందుకు ప్రత్యేక దృష్టి సారించకపోవడం కూడా విడ్డూరంగా ఉంది.

Related Posts