శ్రీకాకుళం, డిసెంబర్ 28
మరో మూడు రోజుల్లో వస్తున్న నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కోవిడ్-19 నియంత్రణతో పాటు, కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ను కూడా వ్యాప్తికాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. ప్రపంచం మొత్తం కరోనా నియంత్రణలో నిమగ్నమై వుంది కాబట్టి ప్రభుత్వాలు చేసే ప్రయత్నాలకు సహకరిస్తూ.. కోవిడ్ నిబంధనలు పాటించడం మనందరి బాధ్యతని, ఆరోగ్యం ఉంటే ఆనందం ఉన్నట్టేనని తెలిపారు. తాను జనవరి1న స్థానికంగా ఎవరికీ అందుబాటులో ఉండడం లేదని తెలిపారు. అందువల్ల తనను కలవడానికి దయచేసి ఎవరూ ప్రయత్నించవద్దని, కేవలం ఆ ఒక్క రోజు మాత్రమే శుభాకాంక్షలు చెప్పాల్సిన పనిలేదని ఏడాది పొడవునా అందరికీ శుభాలు జరిగి పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ ఉండాలని ఆయన ఆకాంక్షించారు. మన ఆత్మీయతలు, అనుబంధాలు, ఎప్పటికీ చెక్కు చెదరవన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు మూకుమ్మడి వేడుకలకు దూరంగా ఉండాలని, కోవిడ్ నిబంధనలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. ఈ సందర్భంగా తన సన్నిహితులు, స్నేహితులు, శ్రేయభిలాషులు, సహచరులు, అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానని పేర్కొన్నారు.