YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు తెలంగాణ

చలాన్లకే పరిమితమైన డ్రంక్ అండ్ డ్రైవ్!

చలాన్లకే పరిమితమైన డ్రంక్ అండ్ డ్రైవ్!

హైదరాబాద్ డిసెంబర్ 28
మద్యం తాగి వాహనం నడిపితే ఏం జరుగుతుందో కళ్లముందే కనిపిస్తోంది. ఆల్కహాల్ తీసుకొని డ్రైవింగ్ చేయడం వల్ల ఎన్నో కుటుంబాలు ఛిద్రమయ్యాయి. మరెన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. కుటుంబానికి ఆసరాగా ఉన్న వ్యక్తి ఇలాంటి ప్రమాదంలో చనిపోతే ఆ కుటుంబం జీవితాంతం కష్టాలనెదుర్కున్నట్లే..! గారాభంగా పెంచుకున్న కొడుకు పోతే కడుపుకోత మిగిల్చినట్లే..! అయితే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా.. మద్యం తాగి వాహనం నడపకుండా పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. తాగిన వారు వాహనం నడపడం మానడం లేదు. పోలీసులు విధించే శిక్షలకు భయపడడం లేదు. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలో రాష్ట్రంలో మద్యం తాగి పోలీసులకు పట్టుబడిన వారెందరు..? ఇలా డ్రైవ్ చేసి ఎంతమంది ప్రాణాలు తీసి జైలు పాలయ్యారు..?మద్యం తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే 304 పార్ట్ 2 కింద కేసు నమోదు చేస్తారు. ఇలా మద్యం తాగి నడుపుతూ పోలీసులకు పట్టుబడిన వారు తెలంగాణలో 50 వేలకు పైగానే ఉన్నారు. ఒక్క సైబరాబాద్ పరిధిలోనే 36వేల కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 6 వేల 588 ఉండగా.. రాచకొండ పరిధిలో 8 వేల 121 కేసులు నమోదయ్యాయి. వీరిలో రెండోసారి పట్టుబడిన వారూ ఉన్నారు. కాగా కొంతమందికే శిక్ష పడినట్లు తెలస్తోంది. దీంతో మందుబాబుల ఆగడాలు ఆగడం లేదు. పైన్లు శిక్షల పేరుతో భయ పెట్టినా పీకలదాక మద్యం సేవించి వాహనం డ్రైవ్ చేస్తున్నారు. వారు పట్టుబడడమే కాకుండా ఇతరుల ప్రాణాలు తీస్తున్నారు.సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 36 వేల 512 మందిలో 27 వేల 600 మంది రెండోసారి పట్టుబడ్డారు. ఈ కమిషనరేట్ పరదిధిలో ఈ ఏడాది 3989 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఇందులో 759 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే వీటిలో డ్రంక్ చేసి డ్రైవ్ చేయడం వల్ల జరిగిన ప్రమాదాలే ఎక్కువగా ఉన్నాయి. మరోవైపు డ్రంకెన్ డ్రైవ్ కేసుల నమోదులో 12 వేల వీగిపోగా 26 వేల కేసులు ఇంకా పెండింగులోనే ఉన్నాయి. దీంతో మందుబాబులు రెచ్చిపోతున్నారు. రాచరకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రోడ్డు ప్రమాదాల్లో 618 మంది మరణించారు. ఇందలో 40 శాతం డ్రంకెన్ డ్రైవ్ ప్రమాద కేసులే ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం 8121 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. గత ఏడాది 3923 ఉండగా ఆ సంఖ్య రెట్టింపయింది.
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది 25 వేల 453 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 6 వేల 588 ఉండగా ఈసారి నాలుగు రేట్లు పెరిగాయి. ఇందులో 10109 కేసు ఫైల్ చేయగా 206 మందికి జైలు శిక్ష పడింది. 25 మంది డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేశారు. 86 మందిపై 304 పార్ట్ 2 కింద కేసులు నమోదు చేసినా ఏ ఒక్కిరికీ శిక్ష పడలేదు. అయితే పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మద్యంబాబులు వాహనాలు నడపడం ఆపడం లేదు. ఫైన్లు శిక్షలు నామమాత్రంగా ఉండడంతో వాటిని పట్టించుకోవడం లేదు. అయితే మరింత కఠినంగా చర్యలు తీసుకోవాలని కొందరు కోరుతున్నారు. ప్రత్యేక డ్రైవ్ పేరుతో చలాన్లు విధిస్తున్నా రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు మరిన్నీ పెరుగుతున్నాయి గానీ.. తగ్గడం లేదు.

Related Posts