న్యూఢిల్లీ డిసెంబర్ 28
భారత దేశ స్వాతంత్ర్యోద్యమంలో తమకు అర్హతలేని పాత్రను కల్పించుకోవడం కోసం చరిత్రను బీజేపీ తిరగరాస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. విద్వేషం, నిరాధార అభిప్రాయాలు నిండిన విభజన సిద్ధాంతాలు మన సమాజపు లౌకికవాద అల్లికకు మహా విపత్తు కలగడానికి కారణమవుతున్నాయన్నారు. ఈ విభజన సిద్ధాంతాలు మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎటువంటి పాత్రను పోషించలేదని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 137వ వ్యవస్థాపక దినోత్సవాల సందర్భంగా మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. విద్వేషం, నిరాధార అభిప్రాయాలు నిండిన విభజన సిద్ధాంతాలు మన సమాజపు లౌకికవాద అల్లికకు మహా విపత్తు కలగడానికి కారణమవుతున్నాయని, ఈ సిద్ధాంతాలు మన దేశ స్వాతంత్ర్య ఉద్యమంలో ఎటువంటి పాత్రను పోషించలేదని చెప్పారు. ఇప్పుడు వీరు తమకు అర్హతలేని పాత్రను కల్పించుకోవడం కోసం చరిత్రను తిరగరాస్తున్నారన్నారు. ‘‘వారు మనోభావాలను రెచ్చగొడతారు, భయాన్ని నింపుతారు, శత్రుత్వ భావాన్ని వ్యాపింపజేస్తారు. మన పార్లమెంటరీ ప్రజాస్వామిక అత్యుత్తమ సంప్రదాయాలను ఉద్దేశపూర్వకంగా దెబ్బతీస్తున్నారు. ఈ విధ్వంసకర శక్తులపై ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తన శక్తినంతటినీ కూడగట్టుకుని పోరాడుతుంది’’ అని సోనియా చెప్పారు. ఎన్నికల్లో ఓటములు ఎదురైనప్పటికీ, కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఎన్నికల్లో గెలుపోటములు అనివార్యమని తెలిపారు. వైవిద్ధ్యభరితమైన సమాజపు ప్రజలందరికీ సేవ చేయాలనే కాంగ్రెస్ నిబద్ధత చిట్టచివరి వరకు కొనసాగుతుందని చెప్పారు.అంతకుముందు సోనియా గాంధీ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, అనేక మంది నేతలు పాల్గొన్నారు.