కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో 130కిపైగా స్థానాల్లో బీజేపీ గెలుస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. ఇతరుల మద్దతు కోరడం కానీ, ఇతరులకు తాము మద్దతు ఇవ్వడం కానీ జరగదని తెలిపారు. ఈ నెల 12న పోలింగ్ జరగనుండటంతో గురువారం సాయంత్రం ఐదు గంటలతో ఎన్నికల ప్రచారానికి తెరపపడింది. ఈ నేపథ్యంలో అమిత్ షా విలేకర్ల సమావేశంలో మాట్లాడారు.కర్ణాటక ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య తాను పోటీ చేస్తున్న చాముండేశ్వరి, బాదామి నియోజకవర్గాల్లో కచ్చితంగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ అప్రజాస్వామిక విధానాలను అవలంబిస్తోందని దుయ్యబట్టారు. రాజరాజేశ్వరి నగర్‌లో ఓ ఫ్లాట్‌లో నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు పట్టుబడటాన్ని మనమంతా చూశామని తెలిపారు. దీనినిబట్టి కాంగ్రెస్ ఎంత నైరాశ్యంలో ఉందో తేటతెల్లమవుతోందన్నారు. ఆ పార్టీకి కేవలం ఎన్నికల్లో గెలుపు మాత్రమే కావాలని, నైతికత, చట్టాలు అక్కర్లేదని ఆరోపించారు. ఏదోలా గెలవానుకేనే కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీపై విమర్శలు గుప్పిస్తోందన్నారు.సిద్ధరామయ్య ప్రభుత్వం మన దేశంలో అత్యంత అవినీతికర ప్రభుత్వమని ఆరోపించారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దారుణంగా విఫలమైన ప్రభుత్వం సిద్ధరామయ్య ప్రభుత్వమేనని తెలిపారు. రైతుల కోసం ఆయన ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. వైఫల్యాలపై సమాధానం చెప్పేందుకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా లేదన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. చాలామంది అధికారులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు.కాంగ్రెస్ వలలో పడవద్దని నకిలీ ఓటరు గుర్తింపు కార్డులు ఉన్నవారిని కోరుతున్నట్లు తెలిపారు. ప్రజలకు సేవ చేయడానికి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి తమకు ఓ అవకాశం ఇవ్వాలని కర్ణాటక ప్రజలను కోరారు.బీజేపీ కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదని కచ్చితంగా చెప్పగలనన్నారు. తమ పార్టీ తరపున 130కి పైగా ఎమ్మెల్యేలు గెలుస్తారని తెలిపారు.