YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీకి మిశ్రమ ఫలితాలిచ్చిన 2021

 గులాబీకి  మిశ్రమ ఫలితాలిచ్చిన 2021

హైదరాబాద్, డిసెంబర్ 29,
తెలంగాణ రాష్ట్ర సమితికి 2021 సంవత్సరం చేదు తీపి మిశ్రమం. అయితే తీపికన్నా చేదు పాళ్లే కాస్త ఎక్కువని చెప్పవచ్చు. దానికి కారణం ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొని వున్న తాజా పరిస్థితులు. అంతేకాదు, కొత్తం సంవత్సరంలో అధికార పార్టీ కోసం పెద్ద సవాళ్లు ఎదురుచూస్తున్నాయి. కాబట్టి, టీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ ప్రయాణం అంత కూలాసాగా సాగకపోవచ్చు. బీజేపీ రూపంలో టీఆర్‌ఎస్‌కు బలమైన ప్రతిపక్షం సిద్ధమవుతోంది. 2023 ఎన్నికల నాటికి అది మరింత శక్తివంతంగా మారవచ్చు.అలాగే, టీఆర్‌ఎస్ పాలనలో ప్రజల ఆకాంక్షలు కూడా పెరిగాయి. వాటిని నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం పై ఉంది. ఇక అమలుకు నోచుకోని హామీలు ఒక్కొక్కటిగా తెరమీదకు వచ్చి ఇరుకున పెడుతున్నాయి. ఇప్పుడు బీజేపీ తీసుకున్న నిరుద్యోగ సమస్య అటువంటిదే. కాబట్టి, వాటిని నెరవేర్చాలన్న డిమాండ్లతో ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఇవిగాక, ఇటీవలి పరిస్థితుల నేపథ్యంలో కేంద్రంతో సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. ఇవన్నీ రాబోయే రోజుల్లో సీఎం కేసీఆర్ ముందు సరికొత్త సవాళ్లుగా మారతాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.కల్వకుంట్ల చంద్రశేఖర రావు సెకండ్‌ టర్మ్‌ పాలన డిసెంబర్‌లో నాలుగవ సంవత్సరంలోకి ప్రవేశించింది. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు గెలుపు ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని ఇది గుర్తు చేస్తుంది. అంటే వచ్చే ఏడాది చివరి నాటికి ఎన్నికల అస్త్ర శస్ర్తాలను గుర్తించి వాటిని రెడీ చేసుకోవాలి. 2022 గులాబీ పార్టీకి అత్యంత ముఖ్యమైన సంవత్సరం అని చెప్పవచ్చు. ఇది ఇలావుంటే, హుజురాబాద్ ఓటమి, వరి ధాన్యం కొనుగోలుపై కేంద్రంతో పోరాటం 2021లో టీఆర్‌ఎస్‌కు పీడకలల లాంటివి. ఈ రెండు పరిణామాలతో వచ్చే ఏడాది కూడా అధికార పార్టీపై నీలినీడలు కమ్మే అవకాశం ఉంది.మరోవైపు, రాష్ట్రంలో ఏడేళ్లు అధికారంలో ఉన్న వేళ టీఆర్‌ఎస్‌ సరికొత్త రాజకీయ పాత్రను కోరుకుంటోంది. జాతీయ రాజకీయాలపై తన మక్కువను తిరిగి ప్రదర్శిస్తోంది. తన జాతీయ ఆశలను పునరుద్ధరించాలని, కేంద్రంలో కీలక పాత్ర పోషించాలని గులాబీ బాస్‌ ఎంతో ఆసక్తిగా కనిపిస్తున్నారు. ఐతే, టీఆర్‌ఎస్ పాలనపై ప్రజా అంచనాలు, వాగ్ధానాలు దానిని వెంటాడే దశకు చేరాయి. ఏళ్ల తరబడి ఇచ్చిన హామీలు ముఖ్యంగా ఉద్యోగాలు కల్పిస్తామన్న పాలకుల హామీలపై యువత నిలదీస్తోంది. అనేక ఇతర పరిష్కారం కాని ప్రజా సమస్యలపై జనం ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగావకాశాలు లేక యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటం తరచూ ప్రజల దృష్టికి వెళుతోంది. ఇవన్నీ కలిసి భవిష్యత్‌లో అధికార పార్టీ నిద్రపోకుండా చేస్తాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.వ్యవసాయం, నిరుద్యోగం సమస్యలపై విపక్షాలు దూకుడు పెంచుతాయి. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం ఎవరో తేల్చుకునేందుకు కాంగ్రెస్, బీజేపీకి ఇది ఒక రాజకీయ అవసరం. దాంతో ఆ రెండు పార్టీల రాజకీయ వేట రాబోవు రోజులలో మరో తారా స్థాయికి చేరవచ్చు.ఇదిలా ఉంటే ఇప్పుడు అధికార పార్టీ ఎదుర్కునే తక్షణ సమస్య వ్యవసాయం. తెలంగాణను వరి భాండాగారంగా మారుస్తానని కొన్ని నెలల కిందట కేసీఆర్‌ అన్నారు. ఆ మాటలే ఇప్పుడు ఆయన పాలిట శాపంగా మారాయి. పార్‌బాయిల్డ్‌ రైస్‌కు డిమాండ్‌ లేనందున రబీ సీజన్‌లో కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దాంతో తెలంగాణ వరి రైతులు సంక్షోభంలో పడ్డారు. దీని నుంచి బయటపడేందుకు సీఎం కేసీఆర్‌ ఇప్పుడు విశ్వప్రయత్నం చేస్తున్నారు. వచ్చే ఏడాది కూడా ఇది కొనసాగవచ్చు.ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులను ఒప్పించడం ఇప్పటికి ఇప్పుడు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ముందున్న తక్షణ సవాలు. వివిధ కారణాలతో వరి పంటలు కాకుండా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతులు విముఖత చూపుతున్న నేపథ్యంలో వారిని ఒప్పించటం చాలా కష్టమైన పని. ప్రస్తుత ఖరీఫ్‌ సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఫిక్స్‌ చేసిన 60 లక్షల టన్నుల పరిమితిని వరి దిగుబడి దాటేసింది. ఈ నేపథ్యంలో మొత్తం ధాన్యాన్ని కేంద్రమే కొనాలని రాష్ట్రం బలవంత పెడుతోంది. వరి కొనుగోలుపై కేంద్రాన్ని ఒప్పించి రాత పూర్వక హామీ కోసం తెలంగాణకు చెందిన మంత్రులు, ఎంపీలు గత వారం ఢిల్లీ వెళ్లారు. కానీ ఎలాంటి ఫలితం ఇవ్వలేదు.మరోవైపు, రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోళు మందకొడిగా సాగుతున్నాయని ప్రభుత్వంపై రైతులు మండిపడుతున్నారు. రైతుల ధాన్యం కొనుగోలు చేయకపోవటం వల్ల రాష్ట్రంలో దాదాపు 200 మంది రైతులు బలవణ్మరణాలకు పాల్పడ్డారని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇది టీఆర్‌ఎస్‌ నేతలను ఇబ్బందిగా మారింది. అందుకే, దీనిని కేంద్రం మీదకు నెట్టాలని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని బీజేపీ ఆరోపిస్తోంది.ఐతే, ఈ పరిణామాలను రైతులు ఎలా తీసుకుంటారో ముందు ముందు తెలుస్తుంది.వరిధాన్యం కొనుగోలుపై కేంద్రంతో తాడో పేడో తేల్చుకోవాలని గత నెలలో అధికార పక్షం నిర్ణయించింది. తెలంగాణ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు పార్టీ శ్రేణులతో కలిసి సీఎం కేసీఆర్‌ దీక్ష కూడా చేశారు. సీఎం ఆందోళనకు దేశ వ్యాప్త ప్రచారం లభించింది. బీజేపీ ప్రభుత్వాన్ని కేసీఆర్‌ తీవ్రంగా విమర్శించటం ఢిల్లీ రాజకీయ వర్గాల దృష్టిని ఆకర్షించింది. అంతేకాదు, కేసీఆర్‌ ఇలా రైతు వ్యతిరేక విధానాలపై కేంద్రంపై బహిరంగ యుద్ధానికి దిగటం జాతీయ రాజకీయాలపై ఆయన ఆసక్తిని చెప్పకనే చెపుతోందని ఢిల్లీ పొలిటికల్‌ సర్కిల్స్స్‌లో చెప్పుకుంటున్నారు. మోడీ ప్రభుత్వంపై తన పోరాటాన్ని విస్తృత పరిచేందుకు అవసరమైతే దేశ వ్యాప్త రైతు ఉద్యమనికి నాయకత్వం వహిస్తానని కూడా చెప్పటం విశేషం.ఆ ప్రయత్నాలలో భాగంగా సాగు చట్టాల వ్యతిరేక ఆందోళనలో చనిపోయిన 750 మంది రైతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఇవ్వటానికి రాష్ట్ర మంత్రివర్గం నవంబర్ 29 న రూ.22.5 కోట్లు మంజూరు చేసింది.మరోవైపు, రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ఇప్పటికే మిషన్ 2023పై కసరత్తు మొదలు పెట్టిన బీజేపీ.. టీఆర్‌ఎస్‌కు కాకపుట్టించే పనిలో నిమఘ్నమై ఉంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రాష్ట్ర బీజేపీ నేతల సమావేశం తర్వాత ఈ విషయం స్పష్టమైంది. టీఆర్ఎస్, కేసీఆర్ అవినీతిని ఎత్తిచూపాలని, ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని బీజేపీ నేతలకు షా సూచించిన విషయం తెలిసిందే. కాబట్టి, ముందస్తు ఎన్నికలకు వెళ్లి కేసీఆర్ మరోసారి అందరిని ఆశ్చర్య పరుస్తారనటాన్ని కమలం పార్టీ నేతలు కోట్టిపారేయటం లేదు.లోక్‌సభతో పాటు అసెంబ్లీకి ఎన్నికలు ఒకేసారి జరిగితే మోడీ వేవ్‌ వల్ల తనకు నష్టం జరుగుతుందని భావించి 2018లో కాల పరిమితికి ఆరు నెలల ముందే కేసీఆర్‌ ఎన్నికలకు వెళ్లారు. ఆయన వ్యూహం ఫలించి 119 సీట్లలో టీఆర్‌ఎస్‌ 88 నియోజకవర్గాలలో గెలిచింది. 2014లో అది గెలిచిన 64 సీట్లకు ఇది 24 సీట్లు ఎక్కువ. అలాగే కాంగ్రెస్‌ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో పన్నెండు మందిని లాగేసుకుని రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేశారు కేసీఆర్‌. కాని, కొద్ది రోజులకే ఆయనకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. 2019లో బీజేపీ ఆఖండ విజయం సాధించటంతో కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్ కల చెదిరిపోయింది. అదే సమయంలో రాష్ట్రంలో నాలుగు లోక్‌సభ స్థానాలు గెలిచి అధికార పక్షానికి బీజేపీ సవాలు విసిరింది. బీజేపీ చేతిలో ఓటమి చవిచూసిన వారిలో కేసీఆర్‌ తనయ కవిత ఉండటం దేశం దృష్టిని ఆకర్షించింది.లోక్‌సభ ఎన్నికల విజయానికి కొనసాగింపుగా 2020లో దుబ్బాక , 2021లో హుజూరాబాద్‌ను స్థానాలను టీఆర్‌ఎస్‌ నుంచి కైవసం చేసుకోవటంతో పాటు గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ)లో తన బలాన్ని గణనీయంగా మెరుగుపరుచుకుంది. తద్వారా ప్రత్యర్థి పార్టీగా బీజేపీ మొదటి స్థానంలో నిలిచింది.మరోవైపు, ఇటీవల హుజూరాబాద్‌ ఓటమి ఇటు పార్టీగే కాక వ్యక్తిగతంగా కూడా కేసీఆర్‌కు పెద్ద ఎదురుదెబ్బ. ఎందుకంటే, తాను తొలగించిన ఈటల రాజేందర్‌ ఐదు నెలల తర్వాత తిరిగి అసెంబ్లీకి రావటం ఆయనకు మింగుడు పడని విషయం. కేసీఆర్ నాయకత్వాన్ని సవాల్ చేసి తన స్థానాన్ని నిలబెట్టుకున్న తొలి టీఆర్‌ఎస్ నేత ఈటల. తనను ఓడించేందుకు కేసీఆర్ సర్వశక్తులు ఒడ్డినా విజయం సాధించారు. ఐతే, హుజూరాబాద్‌ని మినహాయిస్తే ఈ ఏడాది టీఆర్‌ఎస్‌ మంచి విజయాలను సాధించింది. కాంగ్రెస్‌ కురువృద్ధుడు కె. జానా రెడ్డి గట్టి పోటీ ఇచ్చినప్పటికీ నాగార్జున సాగర్‌ అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకుంది. బీజేపీకి ఉన్న ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానంతో పాటు మొత్తం 14 శాసన మండలి సీట్లను గులాబీ పార్టీ గెలుచుకుంది. దాంతో ఏడు పట్టణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినట్టయింది.టీఆర్‌ఎస్‌ ఏర్పడి ఈ ఏడాదికి 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఏప్రిల్ 27న కారు పార్టీ ఆ మైలురాయి దాటింది. అయితే, రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ -19 కేసుల పెరుగుదల కారణంగా ఆవిర్భావ వేడుకలు పెద్దగా నిర్వహించలేదు.ఇక, షెడ్యూల్డ్ కులాల సామాజిక , ఆర్థిక సాధికారత లక్ష్యంతో ‘దళిత బంధు’ ప్రారంభించడం ఈ సంవత్సరంలో జరిగిన ఒక ప్రధాన పరిణామం. అయితే ఇది కేవలం హుజూరాబాద్‌ ఉప ఎన్నికల కోసం తెచ్చిన పథకం అంటూ విపక్షాలు విమర్శించాయి. ఉప ఎన్నికల తరువాత దళిత బంధు అమలు కొనసాగింపుపై విపక్షాలు ప్రభుత్వంపై దాడి చేస్తున్నాయి. దాంతో గత వారం రూ. 250 కోట్లు మంజూరు చేసింది.హుజూరాబాద్ నియోజకవర్గంతో పాటు పైలట్ ప్రాజెక్ట్ కోసం ఎంపికైన నాలుగు మండలాల్లో పథకం అమలు కోసం ఈ నిధులు మంజూరు చేసింది. రాష్ట్రంలో దాదాపు 18 లక్షల దళిత కుటుంబాలు ఉన్నాయని, అన్ని దళిత కుటుంబాలకు ఈ పథకాన్ని అమలు చేసేందుకు రూ.1.80 లక్షల కోట్లు అవసరమని ఆయన గతంలో రాష్ట్ర అసెంబ్లీలో చెప్పారు. దళిత బంద్‌కు వచ్చే ఏడాది బడ్జెట్‌లో రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ డబ్బుతో ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో 2 వేల దళిత కుటుంబాలకు పథకం అందుతుంది. అయితే, కోవిడ్-19 మహమ్మారి ప్రభావంతో రాబడి తగ్గిన కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అలాంటప్పుడు ఇంత భారీ పథకం అమలుకు అదనపు వనరులను ఎలా సమీకరిస్తుందనే దానిపై స్పష్టత లేదు.ఏటా రూ.40 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు చేస్తూ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. కరోనా వల్ల గత ఆర్థిక సంవత్సరంలో రూ. 50,000 కోట్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ఐనా సంక్షేమ పథకాల అమలు ఆగవని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఐతే, ‘దళిత బంధు’ రాకతో సమాజంలోని వెనుకబడిన తరగతులు, మైనార్టీ వర్గాల నుండి కూడా ఈ తరహా పథకాల కోసం డిమాండ్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో అర్హులైన కుటుంబాలన్నిటికి దళిత బంధు అందజేస్తామన్న హామీ కేసీఆర్ ముందున్న అతిపెద్ద సాంఘిక సంక్షేమ సవాల్. ఐతే, ఈ పథకం అమలైనా , కాకపోయినా ప్రజల అసంతృప్తి తగ్గే అవకాశం లేదు. అందుకే ఈ స్కీంపై అతిగా ఆధారపడి ఎన్నికలకు వెళితే ఎదురుదెబ్బకే అవకాశం ఎక్కువ అన్నది విశ్లేషకుల అభిప్రాయం.మరోవైపు, కేసీఆర్‌ రైతు ఆందోళనకు విరుగుడుగా బీజేపీ ఉద్యోగ దీక్షలను సమర్థవంతంగా తెరమీదకు తెచ్చింది. తెలంగాణ ఉద్యమ నినాదంలోనే నియామాకాల అంశం ఉంది. కానీ ఈ ఏడున్నరేళ్లళ్లో పెద్దగా ఉద్యోగ నోటిఫికేషన్లు లేదు. టీఆర్‌ఎస్‌ పాలనలో అది కేవలం ఎన్నికల హామీగానే మిగిలిపోయిందన్న అపప్రదను ప్రభుత్వం మూటగట్టుకుంది. సర్కారు కొలువులు లేక నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితిలో బీజేపీ నిరుద్యోగంపై పోరాటానికి దిగింది. దాంతో ఇప్పుడు వరి పోరాటం పక్కకు వెళ్లి నిరుద్యోగ సమస్య ముందుకొచ్చింది. ప్రస్తుతం బీజేపీ , టీఆర్‌ఎస్‌ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి

Related Posts