YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రేవంత్ జోరు... బండికి తప్పని హోరు

రేవంత్ జోరు... బండికి తప్పని హోరు

హైదరాబాద్, డిసెంబర్ 29,
తెలంగాణ రాజకీయాల్లో ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ప్రజలు అసలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారో అర్ధం కావడం లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్తితుల్లో తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు ఎక్కువ బలం ఉన్న విషయం తెలిసిందే. అయితే రెండోసారి అధికారంలో కొనసాగుతున్న టీఆర్ఎస్‌పై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ క్రమంలోనే దుబ్బాక ఉపఎన్నికలో గెలిచి, జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో సత్తా చాటడంతో బీజేపీ అనూహ్యంగా రేసులోకి వచ్చింది.అసలు గత ఎన్నికల్లో 100కు పైనే స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిన బీజేపీకి, టీఆర్ఎస్‌కు ధీటుగా వచ్చింది. దీంతో మళ్ళీ కాంగ్రెస్ పరిస్తితి కష్టమే అనుకున్న సమయంలో పి‌సి‌సి పగ్గాలు రేవంత్ రెడ్డికి రావడం, రేవంత్ దూకుడుగా రాజకీయం చేయడం, భారీ భారీ సభలు పెట్టడంతో బీజేపీని వెనక్కి నెట్టి టీఆర్ఎస్‌కు ధీటుగా కాంగ్రెస్‌ని తీసుకొచ్చారు. కానీ ఆ వెంటనే ఈటల రాజేందర్ లాంటి బలమైన నాయకుడుని పార్టీలో చేర్చుకుని హుజూరాబాద్ బరిలో టీఆర్ఎస్‌ని మట్టికరిపించడంతో మళ్ళీ బీజేపీ రేసులోకి వచ్చింది.అక్కడ నుంచి బీజేపీ దూకుడు తగ్గలేదు. ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్…వరుసపెట్టి టీఆర్ఎస్‌ని టార్గెట్ చేసి విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇక ధాన్యం కొనుగోలు అంశంలో టీఆర్ఎస్-బీజేపీల మధ్య ఎలాంటి వార్ నడిచిందో తెలిసిందే. ఈ సమయంలో రేవంత్ వెనుకబడ్డారు. పైగా కాంగ్రెస్‌లో లుకలుకలు, హుజూరాబాద్‌లో దారుణంగా డిపాజిట్లు కోల్పోవడంతో కాంగ్రెస్ రేసులో వెనుకబడింది.ఈ పరిస్తితిని తెలుసుకున్న రేవంత్ రెడ్డి మళ్ళీ దూకుడు రాజకీయం చేయడం మొదలుపెట్టారు. కేసీఆర్‌నే డైరక్ట్‌గా టార్గెట్ చేశారు..రైతులని వరి వేయొద్దని చెప్పి..కేసీఆర్ తన ఫామ్ హౌస్‌లో వరిని సాగుచేస్తున్నారని, ఆ ఫామ్ హౌస్ ఉన్న గ్రామానికి వెళ్ళి రచ్చబండ నిర్వహించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ని పోలీసులు అరెస్ట్ చేయడం, పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన చేయడంతో పరిస్తితి మారిపోయింది. పైగా బండి సంజయ్ చేస్తున్న నిరుద్యోగ దీక్షకు అంత హైప్ రాలేదు. అంటే రేవంత్ దూకుడుగా ఉంటే బండికి కాస్త ఇబ్బందే…కాబట్టి బండి స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది.

Related Posts