విజయవాడ, డిసెంబర్ 30,
కృష్ణా జిల్లాలోని విజయవాడ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. ఊహించని ట్విస్ట్‌లు వస్తున్నాయి. ఎప్పుడు హాట్ హాట్‌గా సాగే బెజవాడ రాజకీయాలు ఇప్పుడు మరింత హాట్‌గా నడుస్తున్నాయి. తాజాగా వంగవీటి రాధా అంశం సంచలనంగా మారింది. ప్రస్తుతానికి టీడీపీలో ఉన్న ఆయన, ఆ పార్టీలో యాక్టివ్‌గా లేని సంగతి తెలిసిందే. ఏదో తన పని తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు తప్ప, రాజకీయ పరమైన అంశాల జోలికి వెళ్ళడం లేదు.అలాంటిది తాజాగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు..తనని చంపడానికి కొందరు ప్రయత్నించారని, రెక్కీ కూడా నిర్వహించారని మాట్లాడారు. ఈ మాటలు ఇప్పుడు బెజవాడ రాజకీయాలని కుదేపేస్తున్నాయి. అసలు రాధాని చంపడానికి ప్రయత్నించింది ఎవరనే చర్చ ఎక్కువగా నడుస్తోంది. ఇదే క్రమంలో ఆయన వైసీపీ వైపుకు వెళ్లనున్నారని ప్రచారం జరిగింది. పైగా రాధాకు జగన్ ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని పెట్టింది. అటు మంత్రి కొడాలి నాని, రాధాకు సెక్యూరిటీ వచ్చేలా చేసినట్లు తెలిసింది.
దీంతో రాధా వైసీపీలోకి వెళ్తారనే కథనాలు ఎక్కువైపోయాయి. ఈ తరుణంలోనే రాధా సెక్యూరిటీని తిరస్కరించారు సెక్యూరిటీ తనకు అవసరం లేదని చెప్పేశారు. ఆ వెంటనే టీడీపీ అధినేత చంద్రబాబు, రాధాకు ఫోన్ చేసి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అలాగే సెక్యూరిటీని తీసుకోవాలని కోరారు. అదేవిధంగా వంగవీటి రాధా హత్యకు జరిగిన రెక్కీపై సమగ్ర విచారణ జరుపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్‌ని చంద్రబాబు కోరారు. దోషులపై చర్యలు తీసుకోవాలని లేఖలో డిమాండ్ చేశారు. రాధాకు ఏం జరిగినా ప్రభుత్వానిదే బాధ్యత అని, ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి భయంకరంగా ఉందని అన్నారు.అయితే రాధా విషయంలో ఇలా ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు నడుస్తూనే ఉన్నాయి. ఇక రాధా వైసీపీకి వెళ్లడానికి సిద్ధంగా లేరని అర్ధమవుతుంది. ఆ విషయంలో రాధా పుత్రిగా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.