తిరుపతి, డిసెంబర్ 30,
ఏపీలో కాంగ్రెస్ పార్టీని సమర్ధంగా నడిపించే నాథుడెవరు? కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక కొలిక్కి వచ్చిందా? కాంగ్రెస్ ఆలోచనేంటి? రేసులో ముందున్నది ఎవరు? ఈ ప్రశ్నల్నిటికి సమాధానం రాబోతోంది. ఏపీ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడు నియామకం కొలిక్కి వచ్చింది. ఫ్రంట్ రన్నర్ గా మాజీ ఎంపీ డా.చింతామోహన్ వున్నట్టు తెలుస్తోంది.ఏపీ కాంగ్రెస్ నేతల అభిప్రాయాలపై నివేదిక ను సిధ్దం చేయనున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ జనరల్ సెక్రటరీ ఉమన్ చాందీ. సమర్ధుడు, విధేయుడు, సమన్వయంతో అందరినీ కలుపుకునిపోయే నాయకుడు కోసం అన్వేషణ సాగించింది హైకమాండ్. సంక్రాంతిలోపే ఏపీ సీనియర్ నాయకులను స్వయంగా మరోసారి సంప్రదించనున్నారు ఉమన్ చాందీ.
ముందుగా హైదరాబాద్ లో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్య కుటుంబ సభ్యులను కలవనున్నారు. కుటుంబసభ్యులను పరామర్శించాక అందుబాటులో ఉన్న ఏపీ నేతలతో సమావేశం కానున్నారు ఉమన్ చాందీ. పీసీసీ అధ్యక్షుడు నియామకం, పార్టీని ఏపీలో బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ పై సమాలోచనలు చేయనున్నారు ఉమన్ చాందీ.అనంతరం విజయవాడ వెళ్లి మరోసారి ముఖ్యమైన రాష్ట్ర నేతలను కలిసి అంతిమంగా నివేదిక ను సిధ్దం చేయనున్నారు ఏఐసిసి ఇన్‌చార్జ్ ల బృందం. సాధ్యమైనంత త్వరగా అభిప్రాయ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలని ఏఐసిసి స్పష్టమైన ఆదేశాలిచ్చింది. జనవరి నెలాఖరు కల్లా ఏపీసీసీ నూతన అధ్యక్షుడు నియామకం పూర్తి కావాలనే ఆలోచనలో అధిష్ఠానం వుందని తెలుస్తోంది. పరిశీలనలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సి.డబ్ల్యు.సి) సభ్యులు, కేంద్ర మాజీ మంత్రి, డా. చింతా మోహన్ పేరు వుంది. అంతేకాకుండా, ఏఐసిసి సెక్రటరీ గిడుగు రుద్రరాజు, మాజీ ఎమ్.పి హర్షకుమార్, ఏఐసిసి సెక్రటరీ మస్తాన్ వలీ పేర్లను కూడా పరిశీలిస్తుంది ఏఐసీపీ ఇన్‌ఛార్జ్ ల బృందం.