హైదరాబాద్ డిసెంబర్ 30
ఏడేళ్ల మోదీ పాలనలో ఇచ్చిన హామీలను ఇంతవరకు అమలు చేయలేదని, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజా సమస్యలపై బీజేపీ నేతలకు పట్టింపు లేదని ఆరోపించారు. కేవలం ప్రజల మధ్య విద్వేశాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దేశంలో గతంలో ఉన్న పేర్లను మార్చాలని స్లొగన్స్ తీసుకొస్తున్నారని, గుంటూరులో జిన్నా టవర్ పేరు మార్చాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల ఓట్ల కోసం మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. తాజ్ మహల్, చార్మినార్, గోల్ కొండ లాంటి కట్టడాలను కూల్చాలని డిమాండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేస్తే రిజర్వేషన్స్ కోల్పోతామని, దీనిపై కాంగ్రెస్ పోరాడుతుందన్నారు. ఈ విషయంపై రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్‌కు లేఖ రాశానన్నారు. నిరుద్యోగుల కోసం బీజేపీ దీక్ష చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ‘మోదీ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇచ్చారా?.. మీరిచ్చిన హామీని అమలు చేయకుండా మీరే దీక్షలు చేస్తారా?’ అంటూ హనుమంతరావు బీజేపీ నేతలను ప్రశ్నించారు.