విజయవాడ డిసెంబర్ 30
వచ్చే ఎన్నికల్లో జనసేన+వామపక్షాలతో కలిసి తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తుందని శాసనమండలి మాజీ చైర్మన్ ఎంఏ షరీఫ్ ప్రకటించారు. అంతటి కీలక నేత టీడీపీ పొత్తుల గురించి బహిరంగంగానే ప్రకటించారంటే పొత్తుల విషయంలో చంద్రబాబు నాయుడు క్లారిటీతో ఉన్నట్లే అర్ధమవుతోంది. కాకపోతే టీడీపీ+జనసేన పొత్తులకు కొనసాగింపుగా షరీఫ్ వామపక్షాలను కలిపారంతే.ఇప్పటికే టీడీపీ జనసేన వచ్చే ఎన్నికల్లో కలిసి పోటీ చేయడం ఖాయమనే ప్రచారం జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. జనసేన ఒకవైపు బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఇలాంటి ప్రచారం జరుగుతుండటం గమనార్హం. దీనికి కారణం ఏమిటంటే బీజేపీ జనసేనతో పొత్తుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట. ఒకవేళ మిత్రపక్షాలతో పొత్తు సాధ్యం కాకపోతే వాటిని విడదీసి జనసేనతో చంద్రబాబు పొత్తు పెట్టుకుంటారని టీడీపీలోనే చర్చ జరుగుతోంది.దీనికి తగ్గట్లే మొన్నటి స్ధానిక సంస్ధల ఎన్నికల్లో కొన్నిచోట్ల టీడీపీ జనసేన కలిసి పోటీ చేశాయి. మిత్రపక్షాలే అయినప్పటికీ బీజేపీ-జనసేన మధ్య పొత్తులు ఎక్కడా కనబడలేదు. పైగా 8 జిల్లాల్లోని కొన్ని ఎంపీటీసీ స్థానాల్లో బీజేపీతో కలిసి పోటీ చేయడం కన్నా టీడీపీతో కలవటంతో జనసేన నేతలు ఎక్కువ ఆసక్తి చూపారు. అందుకనే టీడీపీ జనసేనలు కలిసి పోటీ చేశాయి. ఇలాంటి ఘటనలు భవిష్యత్తు పొత్తులకు సంకేతాలుగా నిలుస్తున్నాయి.తాజాగా షరీఫ్ చేసిన వ్యాఖ్యలు సంకేతాలను మరింత బలపరుస్తున్నాయి. కాకపోతే టీడీపీ జనసేన పొత్తుకు షరీఫ్ వామపక్షాలను కూడా కలిపారు. ఇప్పుడు ఎలాగూ అనేక అంశాల్లో చంద్రబాబుకు మద్దతుగానే సీపీఐ నిలబడుతోంది. సీపీఎం మాత్రం దూరంగానే ఉంటోంది. ఒకవేళ టీడీపీ జనసేన పొత్తు ఖాయమైపోతే సీపీఐతో పాటు సీపీఎం కూడా పొత్తులో చేరేందుకు అవకాశముంది. బీజేపీ లేకపోతే చాలు టీడీపీతో కలవటానికి సీపీఎం రెడీగా ఉంది. మొత్తానికి షరీఫ్ భవిష్యత్తులను చాలా స్పష్టగానే వివరించారు. షరీఫ్ అంటే టీడీపీ ముఖ్య నేతల్లో ఒకరన్న విషయం అందరికీ తెలిసిందే.