హైదరాబాద్, డిసెంబర్ 30,
2021 మరికొద్దిగంటల్లో కనుమరుగు కానుంది. అయితే యువత మాత్రం 2021ని సాగనంపుతూ.. 2022కి గ్రాండ్ వెల్కం చెప్పేందుకు రెడీ అవుతున్నారు. కరోనా, ఒమిక్రాన్ ఏమున్నా జాన్తా నై అంటూ వేడుకలకు రెడీ అయిపోతున్నారు. ఆంక్షల బందీఖానా నుంచి వారు బయటపడుతున్నారు. న్యూ ఇయర్ వేడుకలలో ఏటా డ్రగ్స్ విచ్చలవిడిగా ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కి వస్తుంటాయి.ఈసారి కూడా పెద్ద ఎత్తున డ్రగ్స్ , గంజాయి విక్రయాలు జరుగుతాయని పోలీసులు ముందస్తు తనిఖీలు చేపట్టారు. దీంట్లో భాగంగా జగద్గిరిగుట్ట పియస్ పరిధి ఆల్విన్ కాలనీ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులు అఖిల్ సంజయ్ , పరమేశ్ లను అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుండి సుమారు 10 లక్షల విలువగల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు.LSD పేపర్స్ 44, 1ఇంటాక్సిక్ బిస్కెట్, 2 ఇంటాక్సిక్ చాక్లెట్ జెల్లి వీడ్, హైబ్రీడ్ గంజాయి 26 గ్రాములు, 3 సెల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నట్లు బాలానగర్ డీసీపీ తెలిపారు. న్యూఇయర్ వేడుకలకు ఢిల్లీ, గోవా నుండి హైదరాబాద్ కు సరఫరా చేస్తున్నట్లు తెలుస్తుంది. మరింత సమాచారం కోసం నిందితులను కష్టడిలోకి తీసుకుంటామని డీసీపీ తెలిపారు. ఇలాంటి ముఠాలు నగరంలో అనేకం వున్నాయని తెలుస్తోంది. ఎంతమంది దొరుకుతారో.. ఎంతమంది దొరక్కుండా మత్తుని గమ్మత్తుగా యువతకు చేరుస్తారో చూడాలి.