వాషింగ్టన్ డిసెంబర్ 30
కరోనా వైరస్ మహమ్మారిపై పోరాటంలో శాస్త్రవేత్తలు మరో గొప్ప విజయం సాధించారు. ఈ వైరస్ రూపాంతరమైన ఒమైక్రాన్‌తోపాటు ఇతర రూపాంతరాలను కూడా మట్టుబెట్టగలిగే యాంటీబాడీస్‌ను గుర్తించారు. ఈ వైరస్ రూపాంతరం చెందుతుండటంతో మార్పు లేకుండా స్థిరంగా ఉన్న అంశాలను లక్ష్యంగా చేసుకుని ఈ యాంటీబాడీస్ పని చేస్తాయి. ఈ పరిశోధన ఒమైక్రాన్‌కు మాత్రమే కాకుండా భవిష్యత్తులో వచ్చే అవకాశంగల ఇతర రూపాంతరాలకు సైతం వ్యాక్సిన్లను డిజైన్ చేయడానికి, యాంటీబాడీ చికిత్సలకు సహాయపడుతుంది. దీనికి అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్ డేవిడ్ వీస్లెర్ మాట్లాడుతూ, యాంటీబాడీస్‌పై దృష్టి పెడితే, ఈ వైరస్ నిరంతర పరిణామాన్ని అధిగమించేందుకు ఓ మార్గం ఉందని ఈ పరిశోధన వెల్లడించిందని చెప్పారు. స్పైక్ ప్రొటీన్‌ను ఉపయోగించుకుని ఈ వైరస్ మానవుల సెల్స్‌లో ప్రవేశించి, సోకుతుందని తెలిపారు. ఈ స్పైక్ ప్రొటీన్‌లో ఒమైక్రాన్ వేరియంట్‌కు అత్యధికంగా, అసాధారణంగా 37 మ్యుటేషన్స్ ఉన్నాయన్నారు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి సోకడంతోపాటు, అంతకుముందు ఈ ఇన్ఫెక్షన్ సోకినవారికి వేగంగా ఈ వేరియంట్ వ్యాపించడానికిగల కారణాన్ని కొంత వరకు ఈ మార్పులు వివరించగలుగుతాయని భావిస్తున్నట్లు తెలిపారు. కరోనా వైరస్‌లో ఇప్పటి వరకు వచ్చిన రూపాంతరాలు సోకిన రోగుల నుంచి, ఈ వైరస్ గత రూపాంతరాలను ఎదుర్కొనడానికి టీకాలు తీసుకున్నవారి నుంచి, అదేవిధంగా ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత టీకాలు తీసుకున్నవారి నుంచి యాంటీబాడీలను సేకరించి ఈ పరిశోధనలో వినియోగించినట్లు వివరించారు. గతంలో వచ్చిన వేరియంట్లు సోకినవారి నుంచి సేకరించిన యాంటీబాడీస్, ప్రస్తుతం అందుబాటులో ఉన్న, అత్యధికంగా వినియోగంలో ఉన్న ఆరు వ్యాక్సిన్లలో ఏదో ఒకదానిని స్వీకరించినవారి నుంచి సేకరించిన యాంటీబాడీస్‌ను కూడా ఈ పరిశోధనలో అధ్యయనం చేసినట్లు తెలిపారు. మొత్తం మీద చూసినపుడు ఒమైక్రాన్‌ను ఎదుర్కొనడానికి మూడో డోస్ తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుందని తమ పరిశోధనలో వెల్లడైందని చెప్పారు. ఒమైక్రాన్‌ను మట్టుబెట్టగలిగే నాలుగు రకాల యాంటీబాడీస్‌ను పరిశోధకులు గుర్తించారన్నారు.