విజయవాడ, డిసెంబర్ 31,
మొదట నెలన్నారు. ఆ తర్వాత వారం అన్నారు. అటుపిమ్మట 72 గంటల్లో పీఆర్సీ ప్రకటన వస్తుందన్నారు. ఇప్పుడు మళ్లీ నెలంటున్నారు. దీంతో పీఆర్సీ పంచాయితీ మళ్లీ మొదటికొచ్చింది. అలా అలా గడువు దాటేస్తున్నారే కానీ.. పీఆర్సీ మాత్రం ఇవ్వట్లేదు ప్రభుత్వం. చర్చల పేరుతో కాలయాపన మాత్రం చేస్తోంది. ఇచ్చినంత తీసుకుని.. నోరు మూసుకునేలా.. ఉద్యోగ సంఘాలపై ఒత్తిడి పెంచుతోంది. తాజాగా, పీఆర్సీపై ఏపీ సచివాలయంలో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశమైంది. ఆర్థికశాఖ అధికారులు విడతల వారీగా ఉద్యోగ సంఘాలతో చర్చించారు. ప్రస్తుతం 27 శాతం ఐఆర్ ఇస్తున్నందున.. దానిమీద ఇంకొంచం పెంచి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్టు అధికారులు ఉద్యోగ సంఘాలతో చెప్పారు. కొత్తగా రూపొందించిన ప్రతిపాదనలను వివరించారు. అయితే.. అధికారుల తీరుపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఉద్యోగ సంఘ నాయకులు. "సమావేశానికి పిలిచి పీఆర్‌సీ ఎంత ఇస్తారో చెప్పకుండా ఆర్థిక పరమైన అంశాలు వివరిస్తున్నారు. చర్చల పేరుతో కాలయాపన చేస్తున్నారు తప్ప.. ఫలితం ఉండటంలేదు. జనవరి 3న జరిగే జేఏసీ సమావేశంలో తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం" అని ఏపీ జేఏసీ ఛైర్మన్ బండి శ్రీనివాసులు మండిపడ్డారు. ఉద్యోగులను అవమానించడానికి సమావేశాలు నిర్వహిస్తున్నారు తప్ప ఉపయోగం లేదని అమరావతి జేఏసీ ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. "ఏపీలో వచ్చే ఆదాయంలో రూ.75వేల కోట్లు ఉద్యోగుల కోసమే ఖర్చు చేస్తున్నామంటున్నారు. ఉద్యోగుల కోసం 32శాతం ఖర్చు పెడుతూ.. రాష్ట్ర బడ్జెట్ మొత్తం ఖర్చు చేస్తున్నామని చెప్పడం విడ్డూరం. ఫిట్‌మెంట్ ఎంత ఇస్తారంటే మళ్లీ మొదటికొచ్చారు. గతంలోనే ఎక్కువ జీతం తీసుకున్నారు.. దానికి తగ్గకుండా ఇస్తామని చెబుతున్నారు. ఇది అన్యాయం" అని బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుబట్టారు.