రాజమండ్రి, డిసెంబర్ 31,
ఒక సభ పెట్టారు. సక్సెస్ అని సంబరాలు చేసుకుంటున్నారు. వైసీపీని ఓడించినట్లేనని భ్రమల్లో ఉన్నారు. ఇంతకీ బీజేపీ నేతలు ఏం సాధించినట్లు? విజయవాడలో సభ నిజంగా సక్సెస్ అయిందా? రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలను సమీకరించి సభ విజయవంతం అయిందని చెప్పుకోవడం సబబేనా? ఈ సభకు ప్రజామోదం ఉందా? ఈ నాయకులను ప్రజలు అసలు పట్టించుకుంటున్నారా? అంటే లేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. బీజేపీ నేతలకు మంచి వాగ్దాటి ఉంటుంది. ప్రస్తుత ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి సోము వీర్రాజు వరకూ మాటల తోనే ఎదిగారు. ప్రజాబలం పెద్దగా లేకపోయినా వారి వాగ్దాటి వారికి పదవులను తెచ్చిపెట్టింది. కేవలం మాటలు ఉంటే చాలా? ప్రజామోదం అవసరం లేదా? అంటే బీజేపీ నేతల వద్ద సమాధానం లేదు. ఏపీ బీజేపీ ఈ ముప్ఫయి నెలల కాలంలో ఒక పెద్ద కార్యక్రమం చేపట్టిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? అంటే లేవనే చెప్పాలి. రామతీర్థం, అంతర్వేదీ ఘటనల సమయంలో కొంత హడావిడి చేసిన బీజేపీ నేతలు తర్వాత కార్యాలయానికే పరిమితమయ్యారు. సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత భారీ కార్యక్రమాలు చేపట్టిన పరిస్థితి లేదు. తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల్లో మాత్రం పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కపిల తీర్థం నుంచి రామతీర్థం వరకూ పాదయాత్ర అని ప్రకటించి తర్వాత వెనక్కు తగ్గారు. అలాగే అమరావతి రైతుల కోసం పాదయాత్ర అని చెప్పి దానిని కూడా వాయిదా వేశారు. ఇక కేంద్ర నాయకత్వం వత్తిడి మేరకు ఒక సభ పెట్టి వైసీపీని, టీడీపీని తిడితే ప్రజామోదం లభిస్తుందా? ప్రజలు గంపగుత్తగా వీరికి ఓట్లు వేస్తారా? వీరి డైలాగులు విని పోలింగ్ కేంద్రాలకు పరుగులు తీసి కమలం గుర్తుపై బటన్ నొక్కుతారా? కానీ బీజేపీ నేతలు మాత్రం అదే భ్రమల్లో ఉన్నారు. ఈ సభతో వైసీపీ పని అయిపోయిందట. టీడీపీ ఇక దుకాణం బంద్ చేయాల్సిందేనట. తాము మాత్రం బుగ్గ కారు కోసం ఇంట్లో కూర్చుని వెయిట్ చేస్తారట. ఇదీ ఏపీ బీజేపీ నేతల పరిస్థితి. పొరుగు జిల్లాల్లో అక్కడి బీజేపీ నేతలు ఎలాంటి ఆందోళనలు చేస్తున్నారో తెలుసుకుని కాస్త నేలమీదకు దిగితే బాగుంటుంది.
జిన్నా టవర్ పై పాలిటిక్స్
జిన్నా టవర్. గుంటూరులో ల్యాండ్ మార్క్. దేశానికి స్వాతంత్య్రం రాకముందునుంచే అదక్కడ ఉంది. ఇప్పటికీ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఫేమస్ పాయింట్. జిన్నా టవర్ అనే పేరే గాని.. ఇంతకీ ఆ 'జిన్నా' ఎవరో.. ఆయన ఎక్కడి వారో.. గుంటూరువాసులకు అంతగా తెలీక పోవచ్చు. పిలవడమే గానీ.. ఆ పేరు గురించి వారెప్పుడూ అంతగా పట్టించుకున్నది లేదు. కానీ, ఇన్నాళ్లకి ఏపీ బీజేపీ నేతలు జిన్నా పేరును పట్టించుకున్నారు. అదేంటి? పాకిస్తాన్‌కు చెందిన జిన్నా పేరును.. ఆ దేశ ద్రోహి పేరును.. మన గుంటూరులో పెట్టడమేంటి? అంటూ ఇవాళే నిద్ర లేచారు ఏపీ కమలనాథులు. ఉదయానే బీజేపీ కార్యదర్శి సత్యకుమార్ జిన్నా టవర్‌పై వివాదం రాజేశారు. జిన్నా పేరు తొలగించి.. అబ్దుల్ కలాం పేరునో.. గుర్రం జాషువా పేరునో పెట్టాలని డిమాండ్ చేశారు. ఆయనకు వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిలు వంతపాడారు. గంటల గ్యాప్‌లోనే ఈ విషయం తెలుసుకొని.. పక్క రాష్ట్రం తెలంగాణలోని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వారి టోన్‌కు మరింత బేస్ యాడ్ చేశారు. జిన్నా పేరు తీసేస్తారా.. లేక, ఏకంగా టవర్‌నే కూల్చేయమంటారా? అంటూ రాజాసింగ్ తనదైన స్టైల్‌లో వార్నింగ్ ఇచ్చారు. ఇలా.. జిన్నా టవర్‌పై బీజేపీ నేతలు రాద్దాంతం చేస్తూనే ఉన్నారు. బీజేపీ నేతల తీరు చూసి.. గుంటూరువాసులు విసుక్కుంటున్నారు. మాకు లేని అభ్యంతరం.. మీకెందుకు? అంటూ ప్రశ్నిస్తున్నారు. దశాబ్దాలుగా హిందూ-ముస్లిం అనే తేడా లేకుండా గుంటూరులో కలిసుంటున్నామని.. ఇప్పుడు మీరొచ్చి.. జిన్నా పేరుతో రాజకీయం చేసి.. అనవసర ఉద్రిక్తతలను రెచ్చగొట్టొద్దని మండిపడుతున్నారు. విజయవాడలో సోము వీర్రాజు వారు వల్లించిన చీప్ లిక్కర్ వ్యాఖ్యలతో పార్టీకి తీవ్ర డ్యామేజ్ జరిగిందని.. ఆ టాపిక్ నుంచి పబ్లిక్ అటెన్షన్ డైవర్ట్ చేసేందుకే.. ఇలా గుంటూరు జిన్నా టవర్ పేరును ఇష్యూగా మారుస్తున్నారనే విమర్శలూ వస్తున్నాయి.