YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

పల్నాడులో టీడీపీ ప్రభంజనం

పల్నాడులో టీడీపీ ప్రభంజనం

గుంటూరు, డిసెంబర్ 31,
గుంటూరు జిల్లా పల్నాడు రాజకీయాల్లో కొత్త పరిణామాలు జరుగుతున్నాయి. వైసీపీ ఇలాఖా మాచర్లలో నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జనం నీరాజనాలు పలుకుతున్నారు. పల్నాడులో వైసీపీకి కంచుకోటగా ఉన్న మాచర్ల నియోజకవర్గానికి ఇన్చార్జిగా జూలకంటి బ్రహ్మారెడ్డిని నియమించడం ద్వారా సరికొత్త రాజకీయాలకు టీడీపీ తెరతీసినట్లయింది. మాచర్ల టీడీపీ ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా బ్రహ్మారెడ్డి నియోజకవర్గానికి ర్యాలీగా వచ్చారు. అలా వచ్చిన బ్రహ్మారెడ్డి ర్యాలీకి జనం అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. కారంపూడి నుంచి ర్యాలీ ప్రారంభించిన బ్రహ్మారెడ్డిపైన తెలుగు తమ్ముళ్లు అడుగడుగునా బంతిపూల జల్లులు కురిపించారు. ర్యాలీ సందర్భంగా కారంపూడి నుంచి మాచర్ల వరకు ప్రధాన రహదారులు అన్నీ పసుపుమయంగా మారిపోయాయి. బ్రహ్మారెడ్డి భారీ ప్రదర్శనగా మాచర్ల నియోజకవర్గం ముఖద్వారం కారంపూడి మండలం పేటసన్నెగండ్లలోకి ప్రవేశించారు. బ్రహ్మారెడ్డి ర్యాలీ కారణంగా చాన్నాళ్ల తర్వాత మాచర్లలో టీడీపీ పతాకాలు రెపరెపలాడాయి. దీంతో టీడీపీ నేతల్లో ఉత్సాహం ఉరకలెత్తింది. ర్యాలీ సక్సెస్ అవడంతో వారంతా పరవశించిపోతున్నారు. అంతర్గత విభేదాలను పక్కన పెట్టి టీడీనీ నేతలంతా ఒకే తాటిపై నిలిచి బ్రహ్మారెడ్డి ర్యాలీని జయప్రదం చేశారు. నియోజకవర్గం నాయకత్వాన్ని ఆశించిన కుర్రి పున్నారెడ్డి,చిరుమామిళ్ల మధుబాబు కూడా బ్రహ్మారెడ్డితో కలిసి ర్యాలీలో పాల్గొనడం టీడీపీ శ్రేణుల్లో ఒక ఊపు వచ్చింది.నిజానికి మాచర్ల నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా ఉంది. ఈ నియోజకవర్గం ఏర్పాటైనప్పటి నుంచీ ఏ ఒక్కరికీ రెండోసారి ఎమ్మెల్యేగా ఛాన్స్ ఇవ్వలేదు. గతంలో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకే పెట్టని కోటలా ఉండేది. టీడీపీకి నియోజకవర్గంపై గట్టి పట్టు ఉండేది. అలాంటి నియోజకవర్గంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నాలుగు సార్లు వరుసగా గెలవడం గమనార్హం. జూలకంటి బ్రహ్మారెడ్డి చేతికి మాచర్ల నియోజకవర్గం బాధ్యతలను టీడీపీ అప్పగించడం సంచలన నిర్ణయమే అని చెప్పొచ్చు. ఎందుకంటే పిన్నెల్లిని ఢీకొట్టడం అంటే అంత ఈజీ ఏం కాదు. క్షేత్రస్థాయి దాకా పిన్నెల్లికి పట్టు ఉంది. ఈ అంశాలన్నింటిని పరిగణనలోకి తీసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా బ్రహ్మారెడ్డికి నియోజకవర్గం పార్టీ పగ్గాలు అప్పగించారు. బ్రహ్మారెడ్డి తల్లిదండ్రులు జూలకంటి నాగిరెడ్డి, దుర్గాంబ ఇద్దరూ మాచర్ల నియోజకవర్గంలో గతంలో ఎమ్మేల్యేలుగా సేవలు చేసినవారే కావడం గుర్తు చేసుకోవాల్సిన అంశం. రాజకీయ కుటుంబ నేపథ్యం బ్రహ్మారెడ్డి అనుకూలమైన అంశమే. మరో పక్కన టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు వెన్నుదన్నులు కూడా బ్రహ్మారెడ్డికి అందిస్తుండడం విశేషం

Related Posts