YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

భారీగా పెరిగిన ఆదాయపు పన్ను

 భారీగా పెరిగిన ఆదాయపు పన్ను

ఆస్తి పన్ను ముందుగా చెల్లిస్తే 5శాతం రాయితీ ఇస్తున్నట్లు అధికారులు చేసిన విస్తృత ప్రచారం సఫలీకృతమైంది. ఇందులో భాగంగా పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోపాటు  సోషల్ మీడియా ద్వారా పన్ను చెల్లింపుదారులకు సంక్షిప్త సమాచారం పంపారు. ప్రత్యేకంగా ఆటోలకు మైకులు ఏర్పాటు చేయించి వీధుల్లో ప్రచారం నిర్వహించారు. పట్టణాల్లో రూ.లక్ష ఆస్తిపన్ను చెల్లించే వారిని గుర్తించి 5 శాతం రాయితీ గురించి అవగాహన కల్పించడంతోపాటు వారిని నేరుగా కలిసి ముందస్తుగా పన్ను చెల్లించడం వల్ల చేకూరే లాభాల గురించి వివరించారు. పురపాలక శాఖ చేసిన ఈ ప్రయోగం ఫలించింది. గతంలో మాదిరిగానే ఏప్రిల్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పన్ను చెల్లించే వారికి 5 శాతం రాయితీ ఇచ్చింది. ముందస్తుగా పన్ను చెల్లించడంపై విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించడంతో అవగాహన కల్పిస్తుండటంతో చెల్లింపులకు భవన యజమానులు ముందుకొచ్చారు. దీంతో జిల్లావ్యాప్తంగా రూ.10 కోట్ల పైబడి ముందస్తు ఆస్తిపన్ను వసూలైంది. అందులో అనంతపురం నగర పాలక సంస్థ నుంచి రూ.3.69 కోట్లు వసూలు కాగా హిందూపురం మున్సిపాలిటీ నుంచి రూ. కోటి, తాడిపత్రి నుండి రూ.97 లక్షలు, గుంతకల్లు రూ.86 లక్షలు, కదిరి రూ.65 లక్షలు, కల్యాణదుర్గంలో రూ.58 లక్షలు, ధర్మవరంలో రూ.57 లక్షలు, గుత్తిలో రూ.51 లక్షలు, రాయదుర్గంలో రూ.42 లక్షలు, పామిడిలో రూ.25 లక్షలు, పుట్టపర్తిలో రూ.24 లక్షలు, మడకశిరలో రూ.10 లక్షల ఆస్తిపన్ను వసూలు చేయగలిగారు. అనంతపురం నగర పాలక సంస్థ తర్వాత జిల్లాలో రాయితీ పన్ను వసూలు చేయడంలో హిందూపురం మున్సిపాలిటీ రెండో స్థానంలో నిలిచింది. ఇకపోతే గతానికి భిన్నంగా నగర పంచాయితీల్లో సైతం లక్షలాది రూపాయల ముందస్తు పన్ను వసూలు కావడం విశేషం. మడకశిర లాంటి వెనుకబడిన నగర పంచాయతీలో కూడా ఈసారి ఏకంగా రూ.10 లక్షలు ఆస్తిపన్ను వసూలు చేశారు. సాధారణంగా వసూలు చేసే పన్ను కంటే రాయితీపై వసూలు చేసిన పన్ను పలు మున్సిపాలిటీల్లో అధికంగా ఉంటోంది. దీనికి తోడు రెవెన్యూ సిబ్బంది పక్కా ప్రణాళికతో పన్ను వసూళ్లకు ప్రయత్నాలు చేశారు. పన్నుల వసూళ్ళకు సెలవు రోజుల్లో సైతం ప్రత్యేక కౌంటర్లు పనిచేసేలా చర్యలు చేపట్టారు. ఎప్పుడూ లేనివిధంగా మున్సిపాలిటీల్లో ప్రభుత్వం ఆస్తిపన్నుపై కల్పించిన 5 శాతం రాయితీని భవన యజమానులకు వివరించి పన్నులు వసూలు చేయడంలో అటు అధికార యంత్రాంగం ఇటు రెవెన్యూ విభాగం సిబ్బంది సఫలీకృతమైంది.

Related Posts