హైదరాబాద్
317జీవోను రద్దు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం భేటీ అయ్యింది. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగుల ఇబ్బందులను గవర్నర్‌కు వివరించామని తెలిపారు. మరొకసారి సకల జనుల సమ్మె జరగాల్సిందేనని స్పష్టం చేశారు. ఉద్యోగుల బదిలీలాల్లో తీవ్రమైన అవినీతి చోటుచేసుకుందని ఆరోపణలు ఉన్నాయన్నారు. ఉద్యోగ సంఘాల నాయకులకు బీజేపీ వ్యతిరేకం కాదని తేల్చిచెప్పారు. ఉద్యోగులను హింసించిన పాపం కేసీఆర్‌కు తగిలి తీరుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులను పిలిచి చర్చించే వరకు బదిలీల ప్రక్రియను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతి ఉత్తర్వులు వచ్చి 40 నెలలు దాటినా తెలంగాణ ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని విమర్శించారు. ఉపాధ్యాయ, ఉద్యోగులను సంప్రదించకుండా 317జీవోను తీసుకొచ్చారన్నారు. ప్రభుత్వం దగ్గరున్న సీనియారిటీ లిస్ట్ అంతా.. తప్పుల తడకే అని ఆరోపించారు. 317జీవోను సవరించే వరకు ఉద్యోగులకు బీజేపీ అండగా ఉంటుందని బండి సంజయ్ స్పష్టం చేశారు.