YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ల్లూరులో మండుతున్న ఎండలు

ల్లూరులో మండుతున్న ఎండలు

నెల్లూరు జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ప్రజలు పగటిపూట బయటకు వచ్చేందుకు భయపడిపోయేలా పగటి ఉష్ణోగ్రతలు తారస్థాయికి చేరుకుంటున్నాయి. ముఖ్యంగా గత రెండు రోజులుగా అత్యధిక స్థాయి పగటి ఉష్ణోగ్రతలు నమోదవడం చూస్తే రాబోయే రోజుల్లో పరిస్థితిపై ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. రాత్రి ఏడు దాటినా జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జిల్లాలో  43 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రత నమోదైంది. రెండు మూడు రోజుల పాటు జిల్లాలో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదవుతుందని, ప్రజలు ముఖ్యమైన పని ఉంటే మినహాయించి పగలు బయటకు రావద్దని, ఒకవేళ వస్తే తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రజలకు సూచించారు. అధికారుల ప్రకటనతో ప్రజల్లో మరింత ఆందోళన నెలకొంది. ఉదయం 11 గంటల తర్వాత నుంచి నగరంలో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తోంది. సాయంత్రం 5 గంటల పైబడి రోడ్లపైకి ప్రజలు వస్తున్నారు. వ్యక్తిగత పనుల నిమిత్తం నగరానికి వచ్చే వారు తప్పనిసరి పరిస్థితుల్లో నగరంలో ఉండాల్సి రావడంతో మధ్యాహ్నం సమయంలో హోటళ్లలోనూ, సినిమా థియేటర్లలోనూ తమ సమయాన్ని గడిపేందుకు ఇష్టపడుతున్నారు. వివిధ స్వచ్చంధ సంస్థలు నగరంలో పలుచోట్ల మంచినీటి, మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజల దాహార్తి తీరుస్తున్నాయి. నగరంలో ఉన్న పరిస్థితే గ్రామాల్లోనూ కనిపిస్తోంది. ఎండలకు తాళలేక గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పనుల్ని ఉదయం వేళల్లో ప్రారంభించి త్వరగా పూర్తిచేసేలా అధికారులు రూపకల్పన చేసుకున్నారు. పశువులను మేపేందుకు వెళ్లే వారు కూడా చెట్ల నీడ ఉండే మైదానాలను వెతుక్కొని పశువులను మేత కోసం తోలుకెళ్తున్నారు. అయితే నీటి చెలమలు ఎండిపోవడంతో పశువుల దాహార్తి తీర్చడం వారికి కష్టతరంగా మారుతోంది. ఎండలు రోజురోజుకి మండిపోతుండటం, రాబోయే రోజుల్లో మరింత ముదిరే అవకాశం ఉండటంతో ప్రజల్ని అప్రమత్తత చేస్తున్న అధికారులు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆందోళనకర స్థాయికి చేరుకున్న ఉష్ణోగ్రతల వల్ల ఎటువంటి ప్రకృతి వైపరీత్యాలు, మరణాలు సంభవించిన త్వరితగతిన స్పందించేందుకు వీలుగా విజయవాడలో ప్రత్యేక కంట్రోల్ రూంను అధికారులు ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జిల్లాలో కూడా రాబోయే వాతావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Related Posts