తిరుమల, జనవరి 1,
తిరుమల శ్రీవారి ఆలయంపై కరోనా ప్రభావం కనిపించింది. స్వామివారి హుండీ ఆదాయం గణనీయంగా తగ్గింది. గతేడాదితో పోలిస్తే ఆదాయం కాస్త పెరిగినా.. టీటీడీ వేసిన అంచనా కంటే తగ్గింది. ఈ ఏడాది హుండి ద్వారా శ్రీవారికి రూ.826 కోట్లు ఆదాయం వచ్చింది. వరుసగా రెండో ఏడాది కూడా భక్తుల దర్శనాలు తగ్గడంతో హుండీ ఆదాయం తగ్గిందని అధికారులు తెలిపారు. ఈ ఏడాది శ్రీవారిని కోటి నాలుగు లక్షల మంది భక్తులు దర్శించుకోగా.. హుండీ ద్వారా రూ.826 కోట్లు ఆదాయం వచ్చిందని తెలిపారు.2020 ఫిబ్రవరిలో టీటీడీ ట్రస్ట్ బోర్డు తన 2020-21 వార్షిక బడ్జెట్‌ను రూ .3,310 కోట్లకు ఆమోదించింది. ఇది హుండీ రాబడిని రూ.1,351 కోట్లగా చూపింది. గత ఆర్థిక సంవత్సరంలో 12 నెలల కాలంలో కరోనా లాక్డౌన్ ప్రభావంతో స్వామి వారి ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఆ తర్వాత తిరుమలకు భక్తులు పెద్దగా వెళ్లకపోవడం, నిబంధనలు, భక్తులను అధిక సంఖ్యలో అనుమతించకపోవడం వంటి కారణాలు స్వామి వారి ఆదాయం తగ్గడానికి కారణమయ్యాయి. కరోనా, లాక్‌డౌన్ కారణంగా శ్రీవారి ఆలయం 84 రోజుల పాటు మూసివేయబడింది. దీంతో గతేడాది రూ.736 కోట్ల ఆదాయం వచ్చింది.2021 జనవరిలో రూ.83.92 కోట్లకు, ఫిబ్రవరిలో రూ .90.45 కోట్లకు, మార్చిలో రూ .104.42 కోట్లకు స్వామి వారి హుండీ ఆదాయం పెరిగింది. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు తిరుమల స్వామివారిని దర్శించుకోవడానికి అనుమతించే భక్తుల సంఖ్యపై మరోసారి ఆంక్షలు విధించారు. ఇలా హుండీ ఆదాయం మళ్లీ ఏప్రిల్‌లో రూ.62.69 కోట్లకు పడిపోయింది. మేలో రూ .11.95 కోట్లకు తగ్గింది. అయితే జూన్‌లో స్వామి వారి హుండీ ఆదాయం కాస్త పెరిగి రూ. 36.01కోట్లుగా ఉంది. ఆ తర్వాత నెల నుంచి పరిస్థితిలో కొంచెం మార్పు రావడంతో భక్తుల సంఖ్య పెరిగింది. దీంతో గతేడాదితో పోలీస్తే ఈ ఏడాది హుండీ ఆదాయం స్వల్పంగా పెరిగింది.