వేసవి ఎఫెక్ట్ కారణంగా కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ ధరలతో పోటీ పడుతూ చికెన్ కాస్ట్ సైతం కొండెక్కింది. ఉష్ణోగ్రతలు పెరిగిపోవడంతో కోడిమాంసం ధరలకు రెక్కలొచ్చాయి. గత కొన్ని రోజులుగా చికెన్ ధర భారీగా పెరుగుతుండటమే ఇందుకు కారణం. రెండు వారాల క్రితం కిలో బాయిలర్ కోడి ధర రూ.140, స్కిన్‌లెస్ రూ.180గా ఉంది. ప్రస్తుతం ధర రూ.200 చేరుకుంది. కోళ్ల సరఫరాలో భారీ వ్యత్యాసం కారణంగా ధర పెరుగుదల అసాధారణంగా ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ధర అసాధారణ పెరుగుదల కారణంగా వినియోగదారులే కాకుండా దుకాణదారులు సైతం నష్టపోతున్నారు. కోడి మాంసం ధరల్లో భారీ పెరుగుదలకు పలు కారణాలు ఉన్నాయని వ్యాపారులు చెబుతున్నారు. వేసవిలో కోళ్ల పెంపకం చేపట్టకపోవడం, వేడి కారణంగా కోడి బరువు పెరుగుదలలో వ్యత్యాసం ఉండటం, వడగాడ్పులకు కోళ్లు మత్యువాత పడుతుండటం ప్రధాన కారణాలుగా పేర్కొంటున్నారు. వివాహాది శుభకార్యాలు భారీగా ఉండటం కూడా ఓ కారణంగా తెలుస్తోంది. మున్ముందు బాయిలర్, నాటు కోళ్ల ధరలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చికెన్ ధర ఉన్నట్టుండి భారీగా పెరిగిపోవడంతో మాంసాహార ప్రియులు కొంత అసంతృప్తికి లోనవుతున్నారు.