YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం తెలంగాణ ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

ఉత్తర ద్వార దర్శనం ఎందుకు...

ఉత్తర ద్వార దర్శనం ఎందుకు...
వైకుంఠ ఏకాదశి వస్తోందనగానే ఉత్తర ద్వార దర్శనమే గుర్తుకువస్తుంది. వైష్ణవాలయాలలో ప్రత్యేకించి ఏర్పాటు చేసే ఉత్తరద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకుంటే మోక్షం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. అందుకనే ఆ రోజు తెల్లవారుజాము నుంచే ఉత్తరద్వార దర్శనం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంటారు. మనం ఇంతగా తపించిపోయే ఉత్తరద్వార దర్శనం ప్రత్యేకత ఏమిటీ...
పౌరాణిక గాథ
పాలసంద్రం మీద తేలియాడే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలంతా ఈ ఏకాదశి తిథినాడు వైకుంఠాన్ని చేరుకుంటారని ప్రతీతి. అందుకనే ఈ ఏకాదశికి ముక్కోటి ఏకాదశి అన్న పేరు వచ్చింది. మూడు కోట్ల ఏకాదశులకూ సమానం కావడం చేతనే ఆ పేరు వచ్చిందన్న వాదనా లేకపోలేదు. వైకుంఠంలోని విష్ణుమూర్తి దర్శనమే ఈ ఏకాదశి నాడు ముఖ్యమైన ఘట్టం కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అన్న పేరూ ఉంది.
ఈరోజున మహావిష్ణువుని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలిగిందట. ఇక నుంచి ఎవరైతే ఆ వైకుంఠ ద్వారాన్ని పోలిన ఉత్తరద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో, వారందరికీ కూడా తమలాగే మోక్షం కలగాలని ఆ మధుకైటభులు కోరుకోవడంతో... ఉత్తర ద్వార దర్శనానికి ప్రాసస్త్యం ఏర్పడిందంటారు. ఉత్తర ద్వార దర్శనం నాడు తనని దర్శించుకునే భక్తులను అనుగ్రహించుకునేందుకు ముక్కోటి దేవతలతో కలిసి విష్ణుమూర్తి భువికి చేరుకుంటారట.
గాథ వెనుక తత్వం
మనకి పై దిశగా ఉండే దిక్కుని ఉత్తరం అంటాము. అలా ఉత్తరం దిక్కు అభివృద్ధిని, వికాసాన్నీ సూచిస్తుంది. బహుశా అందుకేనేమో పాతాళం వైపుకి సూచించే దక్షిణపు దిక్కుని మనం యమస్థానం అంటాము. మన శరీరంలోనూ జ్ఞానానికి నిలయమైన మెదడు ఉత్తరభాగంలో ఉంటుంది. ఆ జ్ఞానం సంపూర్ణంగా వికసించి, సిద్ధ స్థితిని చేరుకుంటేనే ఆ ఊర్థ్వభాగంలో ఉన్న సహస్రార చక్రం వికసిస్తుందని అంటారు.
అంటే ఆ హరి దర్శనం మనలోని అజ్ఞానాన్ని హరింపచేసి... శాశ్వతమైన శాంతినీ, సత్యమైన జ్ఞానాన్నీ ప్రసాదించమని ఆ విష్ణుమూర్తిని వేడుకోవడమే ఈ ఉత్తర ద్వార దర్శనం వెనుక ఉన్న ఆంతర్యం కావచ్చు. అందుకే ఈ రోజున ఉత్తరద్వార దర్శనం చేసుకునే భక్తులు కేవలం దీనిని ఒక ఆచారంగా కాకుండా... తమలోని భక్తినీ, జ్ఞానాన్నీ వికసింపచేయమనీ వేడుకుంటూ స్వామిని కొలుచుకోవాలి. ఇక ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని భక్తులు... తమ మనసులోనే ఆ వైకుంఠ మూర్తిని దర్శించుకుని తమలోని  అజ్ఞానాంధకారం తొలగిపోయేలా దీవించమంటూ వేడుకోవాలి.
హైందవ సంప్రదాయం భక్తుని మనసు పరిపక్వమై అది అనంతాత్మలో లీనమవ్వాలంటూ ప్రోత్సహిస్తుంది. గాయత్రి మంత్రాన్ని జపించినా, ఉత్తర ద్వార దర్శనంగుండా ఆ విష్ణుమూర్తిని దర్శించుకున్నా... ఆ భక్తుని మేధస్సు వికసించాలనే కోరుకుంటుంది

Related Posts