అకాలవర్షాలు వ్యవసాయ రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. పంట చేతికొచ్చిన సమయంలో కురిసిన భారీ వర్షాలు రైతాంగాన్ని నష్టాల కొలిమిలోకి నెట్టాయి. పండిన కొద్ది పంటను సొమ్ము చేసుకుందామనుకున్న అన్నదాతల ఆశలపై నీళ్లు గుమ్మరించాయి. మొత్తంగా వారం క్రితం కురిసిన అకాల వర్షాలు రైతులను నిలువెల్లా ముంచేశాయి. వానల భయం పూర్తిగా తొలగిపోలేదు. రెండు రోజులగా వాతావరణం వానరాకడకు అనుకూలంగా ఉన్నట్లే కనిపిస్తోంది. దీంతో తెలుగురాష్ట్రాల్లో రైతులు భయాందోళనల్లోనే గడుపుతున్నారు. మొత్తంగా ప్రతికూల వాతావరణం వల్ల తూర్పుగోదావరి కర్షకులు ఆవేదనలో కూరుకుపోయిన పరిస్థితి. ఉ్న పంట కూడా నీటి పాలైపోతుందన్న కలవరం వారిలో నెలకొంది. మూడుసార్లు అకాల వర్షాలు రైతులను నష్టాల్లో ముంచేశాయి. ఉదయం నుండి, సాయంత్రం వరకూ ఎండకాస్తున్నా సాయంత్రం ఆకాశమంతా మబ్బులతో కమ్మివేయడంతో పనలపై ఉన్న పంటతో రైతులు అందోళన చెందుతున్నారు. ఇప్పటికే అకాల వర్షాల దెబ్బకు తేరుకోకుండానే పంటలను ఆరబెట్టుకునే సమయంలో వాతావరణంలో మార్పులు రైతులను టెన్షన్ పెడుతున్నాయి.
పిఠాపురం, గొల్లప్రోలు, కొత్తపల్లిల్లోనే కాక ఇతర గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా ఎండకు ఆరబెట్టిన వరి పనలు ధాన్యరాశులే కనిపిస్తున్నాయి. చేబ్రోలు, గొల్లప్రోలు, మల్లవరం, రహదారిపై ధాన్యాన్ని ఆరబెట్టుకుని కాపాడుకునే పనిలో ఉన్నారు రైతులు. వారం రోజుల పాటు వాతావరణం అనుకూలిస్తే పంటను కొంతమేర కాపాడుకోగలమని చెప్తున్నారు. ఇప్పటికే 50 శాతం పంట పూర్తిగా దెబ్బతిందని, ఉన్న పంటనైనా కాపాడుకునేందుకు పాట్లు పడుతున్నామని పలువరు రైతులు చెప్పారు. అయితే మారిపోతున్న వాతావరణ పరిస్థితులు తమను ఆందోళనలోకి నెడుతున్నాయని వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాక తెలంగాణలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షాల ధాటికి రైతులు భారీగా నష్టపోయారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఏకంగా కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యమే తసిడి ముద్ద అయింది. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంట ఈ విధంగా నీటి పాలు కావడంతో రైతన్నలు ఆవేదనలో కూరుకుపోయారు. ఈఏడాది కూడా ఆర్ధిక సమస్యలు తప్పేలా లేవని వాపోతున్నారు. తమ కష్టాలు గుర్తించి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు.