విశాఖపట్టణం, జనవరి 3,
ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. 2024లో ఎన్నికలు జరగనున్నాయి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఈ ఎన్నికలు అతి పెద్ద సవాల్. ఈ ఎన్నికల్లో గెలుపు చంద్రబాబుకు అత్యవసరం. తన పార్టీని, ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు విజయం చంద్రబాబుకు అవసరం. ఈ ఎన్నికల తర్వాత చంద్రబాబు రాజకీయంగా రిటైర్ మెంట్ తీసుకునే అవకాశం లేకపోలేదు. అందుకే వచ్చే ఎన్నికలు చంద్రబాబు చివరి ఛాన్స్ అనే చెప్పాలి. కానీ చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో గెలుపు అంత సులువు కాదు. ప్రధానంగా అన్ని వర్గాల్లో నమ్మకం కోల్పోయిన నేత చంద్రబాబు. ఆయన అధికారంలో ఉంటే ఒకలా, లేకుంటే మరోలా ఉంటారన్నది ఆయన పార్టీ నేతలే చెబుతుంటారు. అధికారంలో ఉన్నప్పుడు హామీలు, ప్రజలు చంద్రబాబుకు గుర్తుకు రారు. అదే ఆయనకు అసలు సమస్య. ఇప్పుడు ప్రజల మనస్సుల్లోనుంచి దానిని తొలగించాల్సి ఉంటుంది. మరోవైపు కొత్త ఏడాది సందర్భంగా ఈ రెండేళ్లు పోరాటాలను విస్తృతం చేస్తామని చంద్రబాబు చెప్పారు. ఈ ఏడాది ఆయన స్పీడ్ పెంచనున్నారని దీనిని బట్టి అర్థమవుతుంది. ఇప్పటికే నేతల్లో పార్టీ నాయకత్వం పట్ల నమ్మకం లేదు. 70 శాతం మంది నేతలు పూర్తి స్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ముందు వారిని గాడిలో పెట్టాల్సి ఉంటుంది. అదే సమయంలో ఇన్ ఛార్జులు లేని నియోజవకర్గాలకు నియమించాల్సి ఉంది. దీంతో పాటు చంద్రబాబు పొత్తుల వ్యవహారాన్ని కూడా తేల్చాల్సి ఉంది. ఇప్పటికే జనసేన, కమ్యునిస్టు పార్టీలతో పొత్తు ఉంటుందన్న ప్రచారం జరుగుతుంది. దీంతో ఆ పార్టీలు బలంగా ఉన్న నియోజకవర్గాల్లో నేతలు డైలమాలో పడిపోయారు. పొత్తులు కుదుర్చుకుంటే కనీసం యాభై స్థానాల వరకూ చంద్రబాబు త్యాగం చేయాల్సి ఉంటుంది. అక్కడ పార్టీ నేతలను ముందుగానే మానసికంగా సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇన్ని సమస్యల మధ్య చంద్రబాబు పార్టీని ఎలా ముందుకు తీసుకెళతారన్నది ఆసక్తికరంగా మారింది.