కర్నూలు, జనవరి 4,
మండల ప్రజా పరిషత్తులకు రెండో ఉపాధ్యక్ష పదవిని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలోని అన్ని మండల ప్రజా పరిషత్తుల్లో రెండో ఉపాధ్య పదవికి జనవరి నాలుగో తేదీన ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం - 1994లో ప్రభుత్వం సవరణలు చేసింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది జిఓ 91ని జారీ చేశారు. సవరణ ఉత్తర్వుల మేరకు రెండో ఉపాధ్యక్ష పదవికి ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఇసి) కమిషనరు నీలం సహాని మంగళవారం నోటిఫికేషన్ జారీ చేశారు. జిల్లా పరిషత్, మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లోనూ రెండేసి వైస్ చైర్మన్ పోస్టులు ఉన్నాయి. ఆ మాదిరిగానే మండలాల్లోనూ ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేసింది. రెండో వైస్ ఎంపిపి ఎన్నిక కోసం ఎస్‌ఇసి షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. రెండో వైస్ ఎంపిపితోపాటు ఖాళీగా ఉన్న అధ్యక్ష పదవి ఎన్నిక కోసం ఈ నెల 31లోగా నోటిఫికేషన్ జారీ చేస్తారు. జనవరి 4న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, అందులో రెండో వైస్ ఎంపిపి ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల ఆ రోజు ఎన్నిక జరగకపోతే ఐదో తేదీన ఎన్నిక నిర్వహించాలని ఎస్‌ఇసి స్పష్టం చేసింది. రెండోసారి కూడా ఎన్నిక వాయిదా పడితే ఎస్‌ఇసికి తెలియజేయాల్సి ఉంది. రాష్ట్రంలో గుంటూరు జిల్లా దుగ్గిరాల మండల పరిషత్తుకు మినహా మిగిలిన అన్ని మండలాల్లో రెండో వైస్ ఎంపిపి ఎన్నిక జరగనుంది. గుంటూరు జిల్లా నరసరావుపేట, కడప జిల్లా సిద్ధోట్ మండలాల్లో రెండు వైస్ ఎంపిపిలకు ఎన్నికలు జరగనున్నాయి. చిత్తూరు జిల్లా రామకుప్ప, గుర్రంకొండ మండల ప్రజా పరిషత్తుల్లో రెండో వైస్ ఎంపిపితోపాటు ఖాళీగా ఉన్న ఎంపిపి పదవులకూ ఎన్నికలు జరగనున్నాయి. ఇటీవల ఖాళీ అయిన కర్నూలు జిల్లా పరిషత్తు చైర్మన్ పదవికి కూడా జనవరి 4న ఎన్నిక నిర్వహించేందుకు ఎస్‌ఇసి షెడ్యూల్ విడుదల చేసింది. జడ్‌పి చైర్మన్ ఎంవి సుబ్బారెడ్డి తన పదవికి రాజీనామా చేయడంతో ఎన్నిక అనివార్యమైంది. జనవరి 4న ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్ ఎన్నిక నిర్వహించేందుకు ఈ నెల 31లోగా కలెక్టరు నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. 4న ఉదయం 11 గంటలకు జడ్‌పి ప్రత్యేక సమావేశం నిర్వహించి చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఒకవేళ ఆ రోజు ఎన్నిక జరగకపోతే 5న నిర్వహించాల్సి ఉంది.