*విశాఖపట్నం / గుంటూరు, జనవరి 2, 2022 :
పెందుర్తి అర్చకుని పట్ల ఏసీ దుష్ప్రవర్తన పై ఖండన. అకారణ సస్పెన్షన్ తక్షణం ఎత్తివేయాలి. అర్చకునికి బహిరంగ క్షమాపణ చెప్పాలి.
విశాఖ పట్నం నగరం పెందుర్తి వెంకటాద్రి దేవస్ధానం ప్రధానార్చకులు మహంతి రామానుజాచార్యులను దూషించడమే కాక, తనపరిధిలో లేని అర్చకుని సస్పెండ్ చేయించిన దేవాదాయ శాఖ విశాఖ జిల్లా సహాయ కమిషనర్ కళింగరి శాంతి చేసిన దుష్ప్రవర్తన పట్ల అఖిల భారత శ్రీవైష్ణవ సంక్షేమ సంఘం తీవ్రంగా ఖండిస్తున్నట్టు సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్సి.ఎ.పి.రామానుజాచార్యులు, ప్రధాన కార్యదర్శి యతిరాజుల బాలబాలాజి లు ప్రకటించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరులో విడుదల చేసిన ఒక ప్రకటనలో వారు ఈనెల 1వ తేదీన వేంకటాద్రి ఆలయంలో వేలాది భక్తుల ఎదుట ఏసీ నియంతృత్వ పోకడల ప్రదర్శన పట్ల మండిపడ్డారు. గత 25 ఏళ్లుగా ఆలయాన్ని అత్యంత ఉన్నత రీతిలో అభివృద్ధి చేసిన అర్చకుని పై తన అధికార దురహంకారాన్ని భక్తుల ఎదుట ప్రదర్శించడం కోసం చేసిన పనిలాగా కనపడుతోందన్నారు. వేలాది మంది భక్తులు, అధికారులు, ప్రజా ప్రతినిధుల మన్ననలు పొందిన ఈ ఆలయ అర్చకుని పట్ల అందరికీ ఎంతో గౌరవభావం ఉందని, అలాంటిది అర్చకునిపై ఇలాంటి అధికార దర్పంతో కూడిన దురహంకార ప్రదర్శన పై భక్తులు సైతం మండిపడడం గమనార్హమన్నారు.
అక్కడ జరిగిన విషయాల్ని , ప్రధానార్చకులు, భక్తులు విస్తరిస్తున్నా, విడీయోల ద్వారా కనిపిస్తున్నా. . .అవేవీ పట్టించుకోకుండా గ్రహించని, ఇది ఉద్దేశపూర్వకంగా చేసినట్టుగా కనబడుతోందని, ఏకవచన ప్రయోగాలు, సంబంధంలేని విషయాలపై అర్చకుడిని బాధ్యుడిని చేయడం, అలాగే ఇవో ని బెదిరించి ఎటువంటి విచారణ జరపకుండానే, కనీసం వివరణ కోరకుండానే సస్పెండ్ చేయడం న్యాయవిరుద్ధమని పేర్కొన్నారు.
తక్షణమే సస్పెన్షన్ ఎత్తివేసి, అర్చకుడికి, భక్తులకు క్షమాపణ చెప్పాలని లేనిచో న్యాయ, ధర్మ పోరాటానికైనా తమ సంఘం సిద్ధమని తెలిపారు. ఈ సందర్భంగా ఈ విషయం తెలిసిన వెంటనే స్పందించి తగిన న్యాయం జరిగేలా ప్రయత్నించిన స్ధానిక పెందుర్తి శాసన సభ్యులు అదీప్ రాజ్ కు సంఘం కృతజ్ఞత పూర్వక ధన్యవాదాలు తెలిపింది.