YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

నల్గొండలో జోరుగా మిషన్ భగీరథ

నల్గొండలో జోరుగా మిషన్ భగీరథ

ఇంటింటికి శుద్ధ జలం అందించే లక్ష్యంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ ప్రాజెక్ట్ పనులు నల్గొండ జిల్లాలో చురుగ్గా సాగుతున్నాయి. స్థానికంగా ప్రధాన పైపులైన్లు, గుట్టలపై ట్యాంకులు, వాటి కింద సంపుల నిర్మాణం, గ్రామాల్లో అంతర్గత పైపులైన్లు ఏర్పాటుచేస్తున్నారు. ఇక గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల పనులను స్థానిక కాంట్రాక్టర్లకు అప్పగించారు. దీంతో పనులు కొంత త్వరగానే పూర్తి అయ్యాయి. తెలంగాణలో మిషన్‌ భగీరథ నీటిని గ్రామంలో నీటి సరఫరా చేసే బాధ్యతను ఆయా పంచాయతీలకే అప్పగించనుంది. నదులు, జలాశయాల నుంచి తోడే నీటిని గ్రామంలోని సర్వీస్‌ ట్యాంకర్‌కు చేర్చడం వరకే భగీరథ కార్పొరేషన్‌ చూస్తుంది. పంచాయతీయే నీటిని సరఫరా చేస్తుంది కాబట్టి ఇప్పటి మాదిరిగానే గృహ యజమానుల నుంచి రుసుములు వసూలు చేసే అవకాశం ఉంది. ప్రతి ఇంటికి నల్లా బిగించి నీటిని సరఫరా చేయనున్నారు. అయితే నది నుంచి నల్లా వరకు మిషన్‌ భగీరథ కార్పొరేషనే పర్యవేక్షిస్తుందని గ్రామస్థాయి నేతలు అనుకుంటున్నారు. కానీ గ్రామం వద్ద ఉండే సర్వీస్‌ ట్యాంకర్‌లోకి నీటిని చేర్చడంతో భగీరథ కార్పొరేషన్‌ విధులు ముగుస్తాయని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆ తర్వాత పంపిణీని పంచాయతీ పాలకవర్గమే చేపట్టాల్సి ఉంటుందని చెప్తున్నారు.

 

మిషన్‌ భగీరథ నీటిని గ్రామాల్లో అంతర్గతంగా పంచాయతీలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల పంపిణీకి సమస్య ఏర్పడనుందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే గ్రామాల్లో పన్నుల వసూళ్లు మందకొడిగా ఉంది. పూర్తిస్థాయిలో పన్నుల వసూలు ఉండడంలేదు. అంతేకాక 1175 నివాస ప్రాంతాల్లో కృష్ణా నీరు సరఫరా జరుగుతున్నా నిర్వహణ సక్రమంగా లేదని స్థానికులు పెదవి విరుస్తున్నారు. ట్యాంకులను నెలల తరబడి శుభ్రం చేయకపోవడం మరో సమస్య అని అంటున్నారు. ఇదే కాక అనేక గ్రామాల్లో తాగునీరు పంపిణీ సక్రమంగా లేక నీరు వృథాగా పోతోందని చెప్తున్నారు. ఈ ఇబ్బందులకు చెక్ పెట్టి ఇంటింటికి నల్లానీరు సమక్రమంగా అందేలా చర్యలు తీసుకోవాలని అధికార యంత్రానికి సూచిస్తున్నారు. ఇదిలాఉంటే ప్రతీ ఇంటికీ కుళాయి ఏర్పాటు చేసి నెలనెలా రుసుము వసూలు చేయడం పంచాయతీలకు సాధ్యంకాదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. గ్రామం వరకు మిషన్‌ భగీరథ కార్పొరేషన్‌ పర్యవేక్షించినప్పటికీ గ్రామాల్లో అంతర్గతంగా నీటిని పంపిణీ చేయడం, నిర్వహణ కష్టంగా ఉంటుందని కొందరు సర్పంచులు సైతం అంటున్నారు. ఈ ఇబ్బందులను అధిగమిస్తే.. నల్గొండలో మిషన్ భగీరథ సక్సస్ కావడం ఖాయం. 

Related Posts