YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

తెరపైకి మళ్లీ మూడో ముచ్చట

తెరపైకి మళ్లీ మూడో ముచ్చట

హైదరాబాద్, జనవరి 3,
దేశంలో మళ్లీ థర్డ్‌ ఫ్రంట్‌కు టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రయ‌త్నాలు చేస్తున్నారా?  ఇప్పటికే తమిళనాడు వెళ్లి వచ్చిన కేసీఆర్.. ముందుముందు పలువురు బీజేపీ, కాంగ్రెసేతర సీఎంలను, రీజనల్‌ పార్టీల అధినేతల కలువనున్నారా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాల‌పై విరుచుకుప‌డుతున్న టీఆర్ఎస్.. జాతీయస్థాయిలో బీజేపీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత‌ను అనుకూలంగా మాలుచుకోవాలనుకుంటోంది. త్వరలోనే ప్రాంతీయ పార్టీల అధినేత‌ల‌తో జ‌ట్టుక‌ట్టేందుకు గులాబి ద‌ళ‌ప‌తి సిధ్దమ‌వుతున్నారు. పదేపదే అవమానాల పాలు చేస్తున్న ఢిల్లీపై పగబట్టిన కేసీఆర్.. జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు వ్యూహాత్మక అడుగులు వేస్తున్నారు. ఏదో ఆషామాషీగా వ్యవహారంగా కాకుండా..పక్కా వ్యూహాలతో ముందుకు వెళ్తున్నారు.సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వైపుగా అడుగులు వేస్తూ ఇతర రాష్ట్రాల బాట పడుతున్నారు. ఫెడరల్‌ స్ఫూర్తికి విరుద్దంగా రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్రం అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా జాతీయస్థాయిలో ప్రాంతీయ శక్తులను ఏకం చేయాలని కంకణం కట్టుకున్నారు. రెండున్నరేళ్లలో ఒక్కో అడుగు వేసుకుంటూ ఢిల్లీ పీఠం నుంచి బీజేపీకి దింపేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది.  బీజేపీయేతర పాలిత రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ అగ్ర నాయకుల నుంచి చోటా లీడర్స్ వరకు తరచుగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదే విషయాన్ని ఢిల్లీలోనూ రాష్ట్ర మంత్రులు, ఎంపీలు బలంగా వినిపించారు. రాజ్యాంగబద్దంగా ఉండే రాష్ట్రాల హక్కులను కూడా కేంద్రం గౌరవించకపోగా.. కనీస భాద్యతలను కూడా విస్మరిస్తుందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రాల మంత్రులు వస్తే కనీసం కలవడానికి కూడా సమయం ఇవ్వకపోగా.. పనిలేక వచ్చారా అంటూ కేంద్ర మంత్రి పియూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలు.. తమను అవమానపరచడమేనని టీఆర్ఎస్ ఆరోపించింది. రెండు సార్లు ముఖ్యమంత్రి, మంత్రులు ఢిల్లీ వెళ్లి ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను కలిశారు. న‌లుగురు మంత్రుల బృందం ఢిల్లీలో వారం రోజులు ఉన్నా ఎలాంటి స‌మాధానం రాక‌పోవ‌డంపై ఆగ్రహంతో ఉన్నారు కెసిఅర్‌. బీజేపీయేతర, తటస్థ రాష్ట్రాల పట్ల కూడా కేంద్రం తీరుపై దేశవ్యాప్తంగా చర్చ పెట్టాలని భావిస్తున్నారు.రాష్ట్రాల ప్రయోజనాల విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మొండి వైఖరికి నిరసనగా జాతీయ స్థాయిలో బీజేపీ యేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం కావాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్ యేతర పార్టీల అధినేతలతో కూడా కేంద్ర ప్రభుత్వ విధానాలపై చర్చలు జరిపే అవకాశం ఉంది. 2018లో కేసీఆర్ వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీల నేతలను కలిసి ఆనాటి రాజకీయ పరిస్థితులపై చర్చించారు. ఫెడరల్‌ ఫ్రంట్‌ పేరుతో కేసీఆర్‌ ప్రయత్నాలు చేసినా కూడా వర్కువుట్‌ కాలేదు. ఇటీవల తమిళనాడు వెళ్లిన ముఖ్యమంత్రి కేసీఆర్ స్టాలిన్ తో 45 నిమిషాల పాటు భేటీ అయ్యారు. తాజా రాజకీయ పరిస్థితులపై సుదీర్ఘంగా చర్చించారు. ఇక జనవరి నెలలో మరో ఒకటి, రెండు రాష్ట్రాలకు వెళ్లనున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మార్చి లోపు దాదాపు 5 నుండి 8 రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల అధినేతలతో మంతనాలు సాగిస్తారు.పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ థర్డ్ ఫ్రంట్ కు ఆలోచనలు చేస్తున్నారు. శివసేన, ఎన్సీపీ వంటి పార్టీలతో చర్చలు జరుపుతోంది. గోవా, మణిపూర్‌ వంటి చిన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీని టార్గెట్‌ చేసి వలసలు ప్రోత్సహిస్తోంది. జాతీయస్థాయిలో TMCని బలోపేతం చేస్తూ సాధ్యంకాని పెద్ద రాష్ట్రాల్లో స్థానిక ప్రాంతీయపార్టీలతో కూటమి ప్రయత్నాల్లో ఉన్నారు దీదీ. ఈ సమయంలో కేసీఆర్‌ పర్యటనలు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.గతంలో ఫెడరల్ ఫ్రంట్ కోసం కేసీఆర్ ప్రయత్నాలు చేసినప్పటికీ పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారు. లేటెస్టుగా బిజెపికిపై పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకుని కలిసివచ్చే శక్తులతో బీజేపీ విధానాలను ఎండగట్టేందుకు సిద్ధమవుతున్నారు. గత వైఫల్యాల నుంచి పాఠాలతో సరికొత్త ఎత్తుగడలతో ముందుకు సాగుతామని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. మరి జాతీయ రాజకీయాల్లో క్రియాశీల శక్తిగా ఎదగాలన్న టీఆర్ఎస్ ఆకాంక్ష 2022లో నెరవేరుతుందో? లేదో? కాలమే సమాధానం చెప్పాలి..

Related Posts