YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తీవ్రమవుతున్న నీటి పాట్లు

తీవ్రమవుతున్న నీటి పాట్లు

వేసవి విజృంభిస్తోంది. ఎండలు ముదిరిపోతుండడంతో జనాలు అల్లాడిపోతున్నారు. ప్రజలపైనే కాక ఈ ఎఫెక్ట్ నీటి వనరులపైనా తీవ్రంగా ఉంది. భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. దీంతో పలు ప్రాంతాల్లో ప్రజలు తాగునీటి కోసం నానాపాట్లు పడుతున్నారు. ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ ప్రాంతంలో తాగునీటికి సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం జలవనరులు పరిరక్షించేందుకు చెరువుల ఏర్పాటుకు ప్రాధాన్యతనిస్తున్నా ఇక్కడ అలాంటి పరిస్థితి కనిపించడంలేదని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు. తమ ప్రాంతంలో పలు చెరువులు నిరాదరణకు గురవుతున్నాయని చెప్తున్నారు. సంరక్షణ చర్యలు కొరవడడంతో నీటితో కళకళలాడాల్సిన చెరువులు పూడికతో పూడుకుపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. వందల ఏళ్ల నాటి చెరువుల పరిస్థితైతే మరీ దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది. అనేక చెరువుల్లో పూడిక చేరడంతో పాటూ కట్టలో నాణ్యత లోపించిందని స్పష్టంచేస్తున్నారు. కట్టలు పటిష్టంగా లేకపోవడంతో నీరంతా వృథాగా పోతోందని స్థానికంగా జలవనరులకు సమస్యలు ఏర్పడుతున్నాయని అంటున్నారు. చెరువుల స్థితిగతులు సరిగాలేకపోవడంతో చుట్టూ వందల ఎకరాల సాగుభూములు ఉన్నా నీరు అందని పరిస్థితి నెలకొందని రైతులు సైతం వాపోతున్నారు. చెరువుల్లో నిండిన నీరంతా వృథాగా పోవడంతో ఎలాంటి ప్రయోజనాలు దక్కడంలేదని చెప్తున్నారు.  

 

సిరికొండ మండలంలోని పోచంపల్లి, వాయిపేట్‌ చెరువులు నేడు నీరు పూర్తిగా నిండకపోవడంతో ఆశించిన ప్రయోజనం చేకూరడం లేదని స్థానికులు చాలాకాలంగా చెప్తున్నారు. ఈ చెరువులకు పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయిస్తే నీటితో పాటు చేపల పెంపకానికి అనువుగా ఉంటుందని సూచిస్తున్నారు. చెరువులు బాగుపడితే సాగుతో పాటు భూగర్భజలాలు పెరిగి, చేపల పెంపకంతో ఎంతో మేలు చేకూరుతుందని స్పష్టంచేస్తున్నారు. చెరువుల స్థితిగతులు బాగుపడితే పలువురికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని అంటున్నారు. మండువేసవిలోనూ వాయిపేట్‌ చెరువులో కొంత నీరు ఉంటుంది. ఈ చెరువును వందల ఏళ్ల క్రితమే నిర్మించారని స్థానికులు చెప్తుంటారు. ఈ చెరువును పటిష్టం చేస్తే ఆయకట్టు రైతులకు సాగు నీటి సమస్యలు తొలగిపోతాయి. ప్రభుత్వంతో పాటూ సంబంధిత అధికార యంత్రాంగం ఈ విషయమై దృష్టి సారించి పూడిక తీతతో పాటు కట్టకు మరమ్మతులు చేయిస్తే అందరికీ ఉపయుక్తంగా ఉంటుంది. దశాబ్దకాలంగా వర్షాభావ పరిస్థితులు ఉంటున్నాయి. ప్రస్తుతం లా నినో ప్రభావంతో వర్షాలు బాగానే ఉండే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. ఈ నీటిని ఒడిసి పట్టేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించాలి. అప్పుడే రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది.

Related Posts